ప్రతీకాత్మక చిత్రం
ముంబై: అంతరిక్షంలోకి వెళ్తున్న సరే.. నేటికి మన సమాజంలో ఆడపిల్ల అంటే చిన్నచూపు. కుమార్తె అంటే భారంగానే భావిస్తారు చాలామంది తల్లిదండ్రులు. కొడుకునే కనాలని పట్టుబడతారు కొందరు మగాళ్లు.. ఆడపిల్లను కంటే కోడలిని ఇంట్లో అడుగుపెట్టనివ్వరు చాలా మంది అత్తమామలు. ఎందుకంటే కొడుకు పున్నామా నరకం నుంచి రక్షిస్తాడంటారు.. కానీ వాస్తవం ఏంటంటే వృద్ధాప్యంలో ఆ కొడుకే వారికి బతికుండగానే నరకం చూపిస్తాడు.. అప్పుడు వారిని ఆదరించేది.. కడుపులో పెట్టుకుని చూసుకునేది కుమార్తె. నిత్యం మన చుట్టు ఇలాంటి దృశ్యాలు ఎన్ని కనిపిస్తున్నప్పటికి చాలామందిలో మార్పు రావడంలేదు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఇలాంటి వార్తనే. వారసుడే కావాలన్న ఉన్మాదంతో ఓ వ్యక్తి భార్యకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. కొడుకును కనడం కోసం ఆమెకు 1,500 స్టెరాయిడ్లు ఇప్పించాడు. ఇన్నాళ్లు ఈ నరకాన్ని మౌనంగా భరించిన ఆ మహిళ ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు..
ముంబైకి చెందిన బాధితురాలు(40)కి 2007లో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. బాధితురాలి అత్తగారి కుటుంబంలో అందరూ ఉన్నతవిద్యావంతులే. భర్త, అత్తగారు లాయర్లు కాగా ఆడపడుచు ఓ డాక్టర్. మానవత్వం, విచక్షణ లేనప్పుడు ఎంత గొప్ప చదువుల చదివితే మాత్రం ఏం ప్రయోజనం. వారికి మగసంతానం అంటే పిచ్చి. పెళ్లైన నాటిన నుంచి బాధితురాలి భర్త తరచుగా ఆమె దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించేవాడు. కొడుకు పుడితే కుటుంబాన్ని కాపాడతాడని.. ఆస్తికి వారసుడు ఉంటాడని తెలిపేవాడు.
ఈ క్రమంలో బాధితురాలు 2009లో మొదట ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ సారి భర్త ఆమెను ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి.. లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. భార్య చేతనే తనకు ఈ బిడ్డ వద్దని డాక్టర్లకు చెప్పించి మరీ గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత నుంచి బాధితురాలి మీద అఘాయిత్యాలు మొదలయ్యియి. అత్తింటివారు మగపిల్లాడి కోసం ఆమెను తీవ్రంగా వేధించేవారు. భర్త కూడా చికిత్స తీసుకోసాగాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం బాధితురాలి భర్త.. ప్రీ-ఇంప్లాంటేషన్ జన్యు నిర్ధారణ కోసం ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు గర్భధారణకు ముందే పిండం లింగాన్ని పరీక్షించడం కోసం చికిత్స, సర్జరీలు చేశారు. మగపిల్లాడి కోసం ఆమెకు ఏకంగా 1500 హార్మోనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ టెస్ట్, చికిత్సను భారతదేశంలో నిషేధించడంతో అతడు బ్యాంకాక్ తీసుకెళ్లాడు.
ఇక బాధితురాలికి దీని గురించి ఏమాత్రం అవగాహన లేదు. విషయం తెలుసుకున్న తర్వాత ఆమెకు సహనం నశించింది. కొడుకు కోసం తనకు అప్పటికే ఎనిమిది సార్లు అబార్షన్ చేయించడమే కాక ఇప్పుడు ఆమె అనుమతి లేకుండా ఇంత భారీ ఎత్తున స్టెరాయిడ్లు ఇవ్వడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అత్తింటి ఆగడాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment