ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన రావడంతో.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అప్రమత్తమైంది. మంగళవారం అర్ధరాత్రి హడావిడిగా సమావేశమైంది. ఈ భేటీలో ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బోర్డు.. ఇందుకు సంబంధించిన ఓ కీలక నిర్ణయం సైతం తీసుకుంది.
ముస్లిం లా బోర్డు ప్రెసిడెంట్ సైఫుల్లా రెహమానీ అధ్యక్షతన.. ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహాలీ, ముస్లిం లా బోర్డు ఇతర సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. వర్చువల్‌గానే జరిగిన ఈ భేటీ మూడు గంటలపాటు సాగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. భోపాల్ వేదికగా ప్రధాని చేసిన ప్రంసగంతో ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది. ఒక దేశానికి రెండు చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళుతుందని నిలదీశారు. ఇప్పటికే 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు.. దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు.
ఈ నేపథ్యంలో.. వర్చువల్‌గానే ముస్లిం లాబోర్డు భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలనే ప్రధానాంశంగా చర్చించి.. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను మరింత గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు లా కమిషన్‌కు ఓ డ్రాఫ్ట్‌ను సమర్పించేందుకు ముస్లిం బోర్డు సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా!
Comments
Please login to add a commentAdd a comment