
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలై రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన నేతలతో శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశ్వాసపాత్రులమని చెప్పి కొందరు నమ్మక ద్రోహం చేశారని ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీకి వ్యతిరేకరంగా మారిన రెబల్స్ డబ్బుల కోసం అమ్మడుపోయారని ఆరోపించారు. తాను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు (గత నవంబర్‌లో) కొందరు శివసేన ఎమ్మెల్యేలు తనకు ద్రోహం చేసేందుకు ప్లాన్ చేశారని ఉద్ధవ్ ఆరోపించారు.
ప్రస్తుతం తనపై పలు ఆరోపణలు చేస్తున్న ఏక్‌నాథ్ షిండే కోసం తాను అన్నీ చేశానని ఉద్ధవ్ తెలిపారు. ‘ఏక్‌నాథ్ షిండే కుమారుడు శివసేనకు చెందిన ఎంపీ, నేను అతని కోసం అన్నీ చేశాను. నాకు ఉన్న శాఖను కూడా షిండేకు కేటాయించారు. అయినప్పటికీ ఏం ఆశించి షిండే నాపై అనేక ఆరోపణలు చేస్తున్నాడో తెలియడం లేదని’ అన్నారు. బాలాసాహెబ్ తనని ప్రేమించిన దానికంటే శివసేననే ఎక్కువగా ప్రేమించేవాడని ఉద్ధవ్ పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి అన్నారు. తాను అసమర్ధుడినని కార్యకర్తలు అనుకుంటే, పదవిపై తనకు వ్యామోహం లేదని శివసేన పార్టీని కార్యకర్తలే ముందుకు నడిపించవచ్చని అయన చెప్పారు. మరో వైపు శుక్రవారం సాయంత్రం మాతోశ్రీ (ఠాక్రే నివాసం)లో ఎన్‌సీపీ నాయకులు సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment