భువనేశ్వర్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నందున కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఆలయాలను మూసివేసింది. ఉత్సవాలు పండగలపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భౌతిక దూరం పాటించాలని ,ప్రజలు ఒక చోట గుమికూడదని హితవు పలుకుతోంది. అయినా ప్రజలు మాత్రం అవేవీ పట్టకుండా కోవిడ్ నియమాలను తుంగలో తొక్కుతున్నారు. అటువంటి సంఘటన నవరంగపూర్ జిల్లా పపడహండి సమితి మైదల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి నువాపుట్ గ్రామ పంచాయతీ దహనమాల గ్రామంలో శనివారం జరిగింది.
గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన అలెఖ్ ధర్మపూజ యజ్ఞానికి వేలాదిమంది భక్తలు హాజరై కోవిడ్ నియమాలను ఉల్లంఘించారు. కరోనా నియమాలు పట్టించుకోకుండా అలేఖ్ ధర్మ భక్తులు నిర్వహించిన యజ్ఞానికి వేలాదిమంది వచ్చారు. అలెఖ్ ధర్మం నమ్మేవారు నిర్వహించిన యజ్ఞానికి హాజరైన మహిళలు రాత్రి కలశాలలపై దీపాలు వెలింగించి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో వందలాదిమంది అలేఖ్ ధర్మ ప్రచారకులు పాల్గొన్నారు. ఆడంబరంగా జరుగుతున్న అలేఖ్ ధర్మ యాత్ర విషయం తెలిసిన మైదల్‌పూర్ పోలీసులు రాత్రి ఒంటిగంట సమయంలో గ్రామానికి చేరుకుని ప్రజలను చెదరగొట్టారు. ధర్మయజ్ఞం నిర్వహిస్తున్న నిర్వాహకులను విచారణ చేస్తున్నారు. పూజలు గారీ యజ్ఞాలు గానీ నిర్వహించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని, అయితే అలెఖ్ ధర్మ పూజలు నిర్వహించే వారు ఎటువంటి అనుమతి తీసుకోలేదని మైదల్‌పూర్ పోలీస్ అధికారి అనాము దియాన్ వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యలో ఇలా ఎలా పూజలు నిర్వహిస్తారని ప్రజలు ప్రశ్నించారు. నియమాలు పాటించక పోతే కోవిడ్ రక్కసి విస్తరించే ప్రమాదం ఎక్కువ ఉందని అందుచేత నియమాలు పాటించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment