ముంబై: కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి.దీంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు కరోనావైద్యం పేరుతో డబ్బులు దండుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడాను ఝులిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న 92 మంది బాధితులకు రూ.10 లక్షలు తిరిగి చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మహరాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధితులకు కరోనా టెస్ట్ లు చేసి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసి) అధికారులు ట్రీట్మెంట్ చేసినందుకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని అన్నీ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదు. ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్‌ఎంసి అదనపు కమిషనర్ జలాజ్ శర్మ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అధారంగా రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలింది.
దీంతో మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లో రేడియన్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న కరోనా బాధితులు, లేదంటే వారి బంధువులకు రూ .10,32,243 తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శర్మ ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకు డబ్బు చెల్లించే విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని అన్నారు. అంటువ్యాధి మరియు విపత్తు నిర్వహణ చట్టం కింద ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జలాజ్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment