Narayana Murthy Says Kareena Kapoor Ignored Fans On Flight, Old Video Viral - Sakshi
Sakshi News home page

కరీనా తన అభిమానులను పట్టించుకోలేదు: ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు

Published Tue, Jul 25 2023 4:24 PM | Last Updated on Tue, Jul 25 2023 5:49 PM

Narayana Murthy: Kareena Kapoor Ignored Fans On Flight Old Video Viral - Sakshi

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ​ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా నారాయణ మూర్తి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అభిమానులను కరీనా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ దీనిని తాజాగా ఓ ఇన్‌స్టా పేజీలో షేర్‌ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ ఏడాది ప్రారంభంలో ఐఐటీ కాన్పూర్‌ చర్చా కార్యక్రమంలో నారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి కరీనా కపూర్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. అభిమానుల పట్ల ఆమె వ్యవహరించిన తీరును నారాయణ మూర్తి తీవ్రంగా తప్పుబట్టారు.  అయితే మధ్యలో ఆయన సతీమణి సుధామూర్తి కల్పించుకొని నారాయణ మాటలను వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు.

అయినప్పటికీ నారాయణ మూర్తి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలిపారు. ‘నేను ఓసారి లండన్‌ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్‌ కూర్చున్నారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి హాయ్‌ అంటూ పలకరించారు. కానీ, ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తే కనీసం లేచి నిల్చొని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే’నన్నారు నారాయణ మూర్తి.
చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!

ఇంతలో సుధామూర్తి కల్పించుకొని.. కరీనాకు కోట్లలో అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉంటుందని అన్నారు. ‘నారాయణ మూర్తి ఓ సాఫ్ట్‌వేర్‌ వ్యక్తి, కంపెనీ ఫౌండర్‌.. నీకు 10వేల మంది అభిమానులు ఉంటారేమో.. కానీ, సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్‌ ఉంటారు కదా’’ అని అన్నారు. సుధామూర్తి మాటలకు అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. ఆమెను ప్రశంసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు.

అయినప్పటికీ  నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఇక్కడ సమస్య అది కాదు. ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం కూడా ఆ ప్రేమను తిరిగి ప్రదర్శించాలి. ఏ రూపంలోనైనా సరే.. అది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మనలోని అహాన్ని తగ్గించే మార్గాలు అంతే’ నని అన్నారు.
చదవండి: 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement