న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం మరింత దిగజారుతోంది. చలి తీవ్రమవుతోంది. ఢిల్లీతోపాటు ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణిస్తోంది. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాల్లో పొల్లాల్లోని గడ్డిని తగలబెడుతూండటమే రాజధాని ప్రాంతంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మరింత దిగజారేందుకు కారణమవుతోంది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు, సమాచారం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. కొన్నేళ్లుగా నాసా వాతావరణ కాలుష్యంపై ఈ గడ్డి వాముల కాల్చివేత ప్రభావంపై అధ్యయనం చేస్తోంది. తాజాగా నాసా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో (దిగువన) ఎర్రటి చుక్కలు పంటపొలాల్లో కాలిపోతున్న గడ్డిని స్పష్టంగా చూపుతున్నాయి.
నాసా సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ హిరెన్ జెత్వా మీడియాతో మాట్లాడుతూ పంజాబ్, హర్యానాలలో గడ్డివాములను కాల్చడం అధికమవుతున్నదని అన్నారు. కాలుష్య నియంత్రణ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత వరుసగా మూడవ రోజు పేలవ స్థాయిలో నమోదైంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ ఏక్యూఐలో పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవు. బుధవారం ఉదయం పది గంటలకు నగరంలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 238గా ఉంది.
ఢిల్లీలోని సెంటర్ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే నాలుగైదు రోజులలో నగరంలో గాలి నాణ్యత మరింత తగ్గే అవకాశం ఉంది. గాలి నాణ్యత సూచీ 500గా ఉంటే కాలుష్య స్థాయిని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. గడచిన మే తర్వాత తొలిసారిగా ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవమైన స్థాయిని చూపింది. ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలి వేగం మందగించడం, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం
Comments
Please login to add a commentAdd a comment