సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) నీట్ యూజీ– 2022 కోసం అభ్యర్థులు ఏ పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ రాస్తారనే జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. అయితే ఈసారి జాబితాను అభ్యర్థుల సౌకర్యార్థం చాలా ముందుగానే విడుదల చేయడం విశేషం. లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో సెంటర్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఇది అడ్మిట్ కార్డు కాదని, కేవలం అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించే వెసులుబాటు అని ఎన్‌టీఏ తమ నోటీస్‌లో పేర్కొంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 17న జరిగే ఈ పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే దఫాలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 546 పట్టణాల్లో నిర్వహించనున్న నీట్ యూజీ–2022 కోసం ఆంధ్రప్రదేశ్‌లో 29, తెలంగాణలో 24 నగరాలను ఎంపిక చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, కువైట్ సహా పలు దేశాల్లోని 14 నగరాల్లోనూ టెస్ట్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment