న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు రెట్టింపయ్యాయి. గత 24 గంటల్లో 2,067 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.49గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేలు దాటింది. ఢిల్లీ, ముంబైలలో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
కరోనా ఒకరి నుంచి మరొకరికి ఎంత త్వరగా వ్యాపిస్తుందో చెప్పే ఆర్ వాల్యూ మూణ్నెల్ల తర్వాత మళ్లీ 1ని దాటి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాంతో ఫోర్త్ వేవ్ రావచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీలో కేసుల్లో ఒకేసారి 26% పెరుగుదల కనిపించింది. 632 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.42 శాతంగా ఉంది. దాంతో ఢిల్లీలో కరోనా నిబంధనలు కఠినతరం చేశారు. మాస్కులు పెట్టుకోకపోతే రూ.500 జరిమానా విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది.
మూణ్నెల్ల తర్వాత...
కరోనా వ్యాప్తిని సూచించే ఆర్ వాల్యూ 1 దాటినట్టు చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ అంచనా వేసింది. ఇది 1 దాటడం మూడు నెలల తర్వాత ఇదే తొలిసారి. ఢిల్లీ, హరియాణా, యూపీల్లో ఆర్ వాల్యూ కొద్ది వారాలుగా క్రమంగా పెరుగుతోంది. ఈ వాల్యూ ఒకటి కంటే తక్కువ ఉంటే కరోనా అదుపులో ఉన్నట్టు. 1 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకరమే. ‘‘ఏప్రిల్ 5–11 మధ్య 0.93 ఉన్న ఆర్ వాల్యూ 12–18 నాటికి 1.07కి చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రోల్ల 1 కంటే ఎక్కువగా, ఢిల్లీ, యూపీల్లో ఏకంగా 2గా ఉంది’’ అని చెన్పై యూనివర్సిటీ శాస్త్రవేత్త సితాభ్ర సిన్హా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment