న్యూఢిల్లీ: దేశంలోని పేద, మధ్య తరగతితోపాటు యువతకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించిన దేశంగా నిలవడం చాలా ముఖ్యమని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో ‘ఆత్మనిర్భర్ అర్థవ్యవస్థ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. కోవిడ్–19 అనంతరం నూతన ప్రపంచం ఆవిష్కృతం కానుందని, ఆ దిశగా ఇప్పటికే సంకేతాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. భారత్ పట్ల ప్రపంచ దేశాల ధోరణిలో పెద్ద మార్పు రాబోతోందని వెల్లడించారు. భారత్‌ను బలమైన, సాధికార దేశంగా చూడాలని ప్రపంచం కోరుకుంటోందని వ్యాఖ్యానించారు.
సరిహద్దు ప్రాంతాల యువతకు ఎన్‌సీసీ శిక్షణ
‘భవ్యమైన గ్రామాల కార్యక్రమం’తో ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌లోని సరిహద్దు గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని అన్నారు. అలాంటి ప్రాంతాల్లోని యువతకు నేషనల్ క్యాడెట్ కారŠప్స్(ఎన్‌సీసీ) శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, వారు సైనిక దళాల్లో చేరేందుకు ఈ శిక్షణ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ కోణాన్ని పక్కనపెడితే, 2022–23 కేంద్ర బడ్జెట్‌ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు.
పేదల కోసం మరో 80 లక్షల ఇళ్లు
80 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి తాజా బడ్జెట్‌లో రూ.48,000 కోట్లు కేటాయించామన్నారు. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇది కూడా ఒక మార్గమేనని చెప్పారు. పవిత్ర గంగా నది తీరం వెంట 2,500 కిలోమీటర్ల మేర సహజ వ్యవసాయ నడవా(కారిడార్)ను బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి అప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. 5జీ టెక్నాలజీ రాకతో కొత్త యుగంలోకి అడుగు పెట్టబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌లో వరి పండించే రైతులు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కింద రూ.1.5 లక్షల కోట్లు పొందనున్నారని వెల్లడించారు.
సమతుల్య అభివృద్ధి కావాలి
గత ఏడేళ్లుగా తాము తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగానే ఉంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏడేనిమిదేళ్ల క్రితం భారత్ జీడీపీ రూ.1.10 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు రూ.2.3 లక్షల కోట్లకు ఎగబాకిందని గుర్తుచేశారు. సామాజిక న్యాయాన్ని సాధించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అందుకోసమే నిరంతరం పని చేస్తున్నామని వివరించారు. దేశ సంక్షేమానికి సామాజిక న్యాయం తరహాలోనే సమతుల్య అభివృద్ధి చాలా కీలకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment