సాక్షి, న్యూఢిల్లీ: ‘తెలంగాణలోని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఉండాల్సిన ధాన్యం నిల్వలు ఉండట్లేదు. గత నెల 31న ఎఫ్‌సీఐ అధికారులు చేసిన తనిఖీల్లో 40 రైస్ మిల్లుల్లో 4,53,896 బస్తాల ధాన్యం కొరత ఉన్నట్టు తేలింది’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యాన్ని ఎక్కడికి తరలించారు. ఎవరిని మోసం చేసేందుకు, ఎవరి బ్యాంక్ వడ్డీని తప్పించుకోవడం కోసం ప్రయత్నించారు. ఎఫ్‌సీ ఐకి అందించాల్సిన సమయంలో ధాన్యం ఎలా అం దిస్తారు?’ అని ప్రశ్నించారు.
బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం అవకతవకల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లుల్లో స్టాక్స్ పరిశీలనకు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎఫ్‌సీఐ అధికారులను కేంద్రం ఆదేశించిందన్నారు. కొన్ని మిల్లుల్లో ధాన్యం కొరత విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరామని, రైస్ మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఎం దుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. మిల్లు లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లేఖ రాయబోతోంద న్నారు. రైస్ మిల్లులు, కేంద్రానికి/ఎఫ్‌సీఐకి మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉండని కారణంగా నేరుగా సీబీఐ దర్యాప్తు చేయించే అవకాశం కేంద్రానికి ఉండదన్నారు.
బియ్యం కొనుగోలుకు అంగీకరించి ఏర్పాట్లు చేయరా?
ప్రస్తుత యాసంగి సీజన్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు ఈ నెల 13న తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఈ నెల 18న కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఏర్పాట్లు ప్రారంభించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు, రైస్ మిల్లర్లకు స్పష్టత ఇవ్వలేదన్నారు. పైగా బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించిన తర్వాత కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గతంలో కేంద్రం అనేక సమావేశాలను నిర్వహిం చినా పచ్చి అబద్ధాలు, విష ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడంతో రాష్ట్రంలోని చాలా మంది రైతులు మద్దతు ధర కన్నా తక్కువకే ధాన్యం అమ్ముకున్నారని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడారని, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని విమర్శించారు.
15 కోట్ల గోనె సంచులకు రాష్ట్రం దగ్గర కోటి కూడా లేవు
గత రబీ, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ టార్గెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత యాసంగి సీజన్ 60 ఎల్‌ఎంటీ ధాన్యం సేకరణకు కనీసం 15 కోట్ల గోనె సంచులు అవసరం కాగా తెలంగాణలో కోటి బస్తాలు కూడా లేవన్నారు. అన్ని రాష్ట్రాలూ జనవరి నుంచే గోనె సంచుల సేకరణ ప్రారంభించా యని, తెలంగాణలో మాత్రం ప్రారంభంకాలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ రకంగా ధాన్యాన్ని సేకరించి రవాణా చేస్తారన్నారు. ‘తండ్రీకొడుకుల ప్రభుత్వం.. తట్టల్లో బియ్యం మోస్తుందా?’ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని, యుద్ధ ప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం కొనాలని, రైస్ మిల్లర్లపై అజమాయిషీ చేసి రైతులను ఆదుకునేందుకు ముందుకురావాలని అన్నారు.
కమీషన్ల కోసం అప్పులు తెస్తున్నారు
రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్ నష్ట పరిహారం ఇస్తే తమకేం ఇబ్బంది లేదని కిషన్‌రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో పేదలే లేనట్టు, రైతుల ఆత్మహత్యలు జరగనట్టు, నిరుద్యోగ యువకుల బలిదానాలు చేసుకోనట్టు చూపించే ప్రయత్నం చేయొద్దన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయలు, దుర్మా ర్గాలు, మాఫియా కారణంగా ఆత్మహత్యలు చేసు కుంటున్న కుటుంబాలను ముందు ఆదుకోవాల న్నారు. రాష్ట్రంలో చనిపోయిన రైతులు, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తోందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ఆలోచించే తమకు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబీకుల సర్టిఫికెట్ అవసరంలేదన్నారు.
లేఖలు రాస్తే పట్టించుకోరా?
‘వరి, గోధుమ ఎక్కువగా పండే ప్రాంతాల్లో జీవ ఇంధన అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలని 2018లో అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అదే సంవత్సరంలో అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2019లో తెలంగాణ సీఎస్‌కు మరోసారి లేఖ రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాలసీని ఉపయోగించు కోలేదు. పైగా ఫోర్టిఫైడ్ రైస్ విషయంలోనూ రైస్‌మిల్లర్లను ప్రోత్సహించడంలో విఫలమైంది’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment