లక్నో: ఏనుగమ్మ ఏనుగు అని పాట పాడుకుంటూ మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేశాం. ఇప్పుడు ఆ ఏనుగుకు పేరు పెడితే అదిరిపోయే బహుమతి సొంతమయ్యే అవకాశం వచ్చింది. ఏనుగుకు పేరు పెడితే తాము బహుమతి ఇస్తామని ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. కొత్తగా పుట్టిన ఏనుగు పిల్లకు పేరు సూచించాలని అధికారులు తెలిపారు.
కర్ణాటక నుంచి పది ఏనుగులను ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి జిల్లా దక్షిణ సోనారిపూర్ ప్రాంతంలోని దుధ్వా టైగర్ రిజర్వ్ (డీటీఆర్)కు తరలించారు. ఆ గుంపులో ఉన్న ‘థెరిసా’ అనే ఏనుగు ఈ నెల 3వ తేదీన ఒక పిల్లకు జన్మనిచ్చింది. కొత్తగా పుట్టిన ఆ పిల్ల ఏనుగుకు పేరు సూచిస్తే బహుమతి సొంతం చేసుకుంటారని డీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్ పాఠక్ ప్రకటించారు. తగిన పేరును సూచించిన వారికి ఆశ్చర్యకరమైన బహుమతిని అందిస్తామని చెప్పారు. ఈ మేరకు పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులను ఈ పోటీకు అనుమతించారు.
కర్నాటక నుంచి యూపీకి తీసుకువచ్చిన మొదట్లో వాటి ఆరోగ్యంపై అధికారులు ఆందోళన చెందారు. అయితే అక్కడి వాతావరణానికి, ఆ ప్రాంత ఆహారానికి అలవాటుపడడంతో యూపీ అధికారులు ఆనందం పొందారు. దీంతో వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. వాటికి పేర్లు పెట్టి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఆ ఏనుగులు కన్నడకు కాకుండా హిందీ భాషకు స్పందిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment