సాక్షి ముంబై: అన్‌లాక్‌లో సడలింపులిస్తున్నామని, కానీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా గుమిగూడటం సమంజసం కాదని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి మళ్లీ లాక్‌డౌన్ విధించడమే పరిష్కారం కాదన్నారు. ఒకవేళ మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే.. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఏం చేశారంటే లాక్‌డౌన్ విధించానని చెప్పాలా? అని ప్రజలను సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం, చేతులు తరచు కడగడం మూడు సూత్రాలు అత్యంత కీలకమైనవని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం మనచేతిలో ఉందని ఇప్పటి వరకు అందరి సహకారంతో కరోనాను నియంత్రణలో ఉంచగలిగామని తెలిపారు. కానీ, మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం కొంత ఆందోళనకరమన్నారు.
25 కోట్ల డోసులు అవసరం..
కరోనాకు విరుగుడు టీకా రాలేదని అది ఎప్పుడు వస్తుంది..? వచ్చినా ఎలా నిల్వ ఉంచాలి.. ? తదితరాలపై ఎలాంటి స్పష్టత లేదని సీఎం వ్యాఖ్యానించారు. కరోనా టీకా రెండు విడతలుగా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి సమయంలో మన రాష్ట్రంలో సుమారు 12.5 కోట్ల జనాభా ఉంది. దీంతో మనకు 25 కోట్ల డోసులు అవసరం ఉంటుందని, కానీ, టీకా విషయంపై ఇంకా స్పష్టత లేదని గుర్తుచేశారు. అయితే అన్నింటికంటే ప్రధానంగా ప్రజలందరూ మాస్క్ ధరించడం, భౌతికదూరం, తరచు చేతులు కడగడం అన్నింటికంటే ఉత్తమమన్నారు. రోడ్లపై అనవసరంగా రద్దీ చేయవద్దని కోరారు. మందిరాలలో కూడా రద్దీ ఎక్కువవుతోందని తెలిసిందని, దీనిపై కూడా అందరు ఆలోచించాలని సూచించారు. (264 మంది టీచర్లకు కరోనా)
మళ్లీ లాక్‌డౌన్ విధించడమే పరిష్కారం కాదని సీఎం అన్నారు. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో పండుగలు సాధారణంగా జరుపుకొంటూ వచ్చామని, ముఖ్యమంత్రిగా ఇచ్చిన పిలుపుమేరకు దీపావళి పండుగ సమయంలో టపాసులు కాల్చవద్దంటే ప్రజలు సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. కొందరు టపాసులపై నిషేధం విధించాలని, చట్టం తీసుకురావాలన్నారని, కాని ప్రతిదానికి చట్టం తీసుకురావడం సబబుకాదని సీఎం హితవు పలికారు. అందుకే మూడు సూత్రాలను పాటించడంతోపాటు అనవసరంగా రద్దీ చేయకుండా కరోనా వ్యాప్తిని నియంత్రిద్దామని ఉద్ధవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. (డిసెంబర్ 31 వరకు పాఠశాలలొద్దు)
రెండో దశ రావొచ్చు..
అందరి సహకారంతో కరోనాను నియంత్రణలో ఉంచగలిగామని, మెల్లమెల్లగా మిషన్ బిగిన్ ఆగైన్ పేరుతో ఒక్కో సేవలను ప్రారంభించామని ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. అయితే ఆలయాలు తెరవడం వివిధ సేవలను ప్రారంభిస్తున్నామంటే కరోనా పూర్తిగా పోయినట్లు కాదని గుర్తుంచుకోవాలన్నారు. దీపావళి పండుగ తర్వాత కరోనా రెండో దశ వ్యాప్తి రాష్ట్రంలో వచ్చే అవకాశాలను కాదనలేమని సీఎం ప్రజలను హెచ్చరించారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా సునామిలా కరోనా మరింత పెరుగుతుందేమోననే భయాందోళనలు కలుగుతున్నాయన్నారు. యువతలో కూడా కరోనా సోకడం కొంత ఆందోళన కలిగిస్తోందని ఈ సందర్భంగా ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. మాజీ కుటుంబ్ మాజీ జవాబ్‌దారీ పథకం మంచి ఫలితాలనిచ్చిందని సీఎం అన్నారు. పథకం ఉద్ధేశం మహారాష్ట్ర హెల్త్ మ్యాప్ తయారు చేయడమేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment