మసూద్ అజార్, ఒమర్ ఫరూఖ్, సమీర్, అదిల్(ఎడమ వైపు నుంచి)
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది 40 మంది జవాన్లను బలి తీసుకున్న పుల్వామా దాడి వెనుక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు రాఫ్ అస్ఘర్‌లతో సహా 19 మంది ప్రమేయం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగాలు నమోదు చేసింది. పాకిస్తాన్ ఆదేశాల మేరకు ఈ ఉగ్రవాదులంతా పేలుళ్లకు పాల్పడినట్టుగా ఎన్‌ఐఏ మంగళవారం జమ్మూలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన 13,500 పేజీల చార్జిషీట్‌లో పేర్కొంది. అజర్, అతని సోదరుడు, మేనల్లుడు, ఇప్పటికే ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉమర్ ఫరూఖ్, అమ్మర్ అల్వీ తదితరుల పేర్లు చార్జిషీట్‌లో ఉన్నాయి.
అభియోగాలు నమోదైన ఉగ్రవాదుల్లో ఆరుగురు ఇప్పటికే ఎన్‌కౌంటర్లలో మరణించగా, మరోనలుగురు పరారీలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కశ్మీర్‌లోనే ఉన్నట్టు సమాచారం. ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో దిట్టయిన ఉమర్ ఫరూఖ్ ఈ దాడిని పర్యవేక్షించడానికి 2018లో భారత్‌లోకి చొరబడ్డాడు. 1999 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఇబ్రహీం అతర్ కుమారుడే ఇతడు. 2019 ఫిబ్రవరిలో ఫరూఖ్ ఈ దాడి చేయించాడు. ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌లో ఫరూఖ్ మరణించాడు.
ఆత్మాహుతి బాంబర్ చివరి వీడియో
చార్జిషీటులో వెల్లడించిన వివరాల ప్రకారం పుల్వామా దాడికి పాల్పడిన ఆత్మాహుతి బాంబర్ అదిల్ అహ్మద్ దార్ 200 కేజీల పేలుడు పదార్థాలతో నింపిన కారుని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రయాణించే వాహనాన్ని ఢీ కొన్నాడు. పుల్వామాలో షేక్ బషీర్ నివాసంలో బిలాల్ అహ్మద్ కుచే అన్న ఉగ్రవాది తెచ్చిన హైటెక్ ఫోన్ ద్వారా దార్ తన చివరి వీడియోని తీశాడు. దాడిలో అహ్మద్ దార్ మరణిస్తే, బషీర్, బిలాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్‌ఐఏకి ఎన్నో సవాళ్లు
పుల్వామా దాడి కుట్రదారులు, దానిని అమలు పరిచిన వారు వివిధ ఎన్‌కౌంటర్లలో మరణించడంతో దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లడం ఎన్‌ఐఏకు కత్తి మీద సాము అయింది. కారు యజమాని అహ్మద్ దార్ అని నిరూపించడానికి ఎంతో కష్టపడ్డామని ఓ అధికారి చెప్పారు. పేలుడులో నంబర్ ప్లేట్ సహా కారు పూర్తిగా «నుజ్జునుజ్జయినా ఆ కారు యజమానుల జాబితాను సేకరించామని తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ అహ్మద్ దార్ అవశేషాలను సేకరించి, అతని తండ్రి డీఎన్‌ఏతో సరిపోల్చి ఇదంతా చేసిన వ్యక్తి దార్‌యేనని కోర్టులో నిరూపించాల్సి వచ్చిందని ఆ అధికారి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment