పాట్నా: ప్రభుత్వ విధానాలపై గళమెత్తడం.. నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగ హక్కు. దీన్ని పాలక ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. తాజాగా బీహర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనలు చేస్తే.. ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు రావని.. ఒకవేళ ఉద్యోగాలు ఉంటే కోల్పోయేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిహార్ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హింసాత్మక నిరసనలకు దిగడం, రహదారుల దిగ్భందించడం, ధర్నాల్లో పాల్గొనడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ ఎస్‌కే సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావని, వారికి ఎలాంటి ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కవనీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిరసనల్లో హింస చెలరేగితే ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారి సర్టిఫికెట్లు, ప్రవర్తన ధ్రువీకరణ పత్రాల్లో రిమార్క్ రాస్తారని తెలిపింది. ఇటీవల సోషల్ మీడియాపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి. నితీశ్‌కుమార్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తోందని.. హిట్లర్, ముస్సోలిని మించిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment