రూర్కీ: అధికార మదంతో ఓ ఎమ్మెల్యే పోలీస్ అధికారిపై డబ్బులు విసిరికొట్టిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఛలానా కట్టమన్న అధికారులపై తన ఆక్రోశం వెల్లగక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ బత్రా ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి షికారుకు వెళ్లాడు. ఆ టైంలో ముస్సోరి దగ్గర మాల్ రోడ్‌లో ఆయన కారును పోలీసులు ఆపారు. కొవిడ్ రూల్స్ ప్రకారం..బయట తిరిగే టైం ముగియడంతో పాటు ఆ టైంలో బత్రా మాస్క్ పెట్టుకోలేదని చెబుతూ పోలీసు అధికారి ఒకరు ఛలానా రాశాడు. అయితే తాను ఎమ్మెల్యేనని, తనకే ఛలానా రాస్తారా? అంటూ అధికారులపై ఊగిపోయాడు ప్రదీప్. అయినప్పటికీ ఆ అధికారి మాత్రం ఛలానా కట్టాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో కారులోంచి డబ్బు తెచ్చి పోలీసులపై విసిరి.. ‘ఎంత కావాలో తీసుకో!’ అంటూ.. ఎమ్మెల్యే ప్రదీప్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు.
— ashwik (@ursashwik) June 17, 2021
ఇక అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి.. వైరల్ చేశాడు. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం మొదలైంది. పోలీస్ అధికారికి ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్ పోలీసుల సంఘం ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసింది. అయితే ఆ టైంలో తాను, తన కుటుంబం మాస్క్ పెట్టుకునే ఉన్నామని, ఐడీ కార్డు చూపించినా ఆ అధికారి వినలేదని, పైగా పోలీసులే తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రదీప్ చెప్తున్నాడు. ఇక ఈ ఘటనలో అధికారి తన డ్యూటీ సక్రమంగా చేశాడని, విమర్శల నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడతామని ఉన్నతాధికారులు తెలిపారు.
చదవండి: గాడిదపై తిరుగుతున్నారేమో!
Comments
Please login to add a commentAdd a comment