న్యూఢిల్లీ: 39 ఏళ్ల క్రితం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లో ఆనాటి కాంగ్రెస్ ఎంపీ జగదీశ్ టైట్లర్ గురుద్వారా పుల్ బంగాశ్ వద్ద అల్లరిమూకను రెచ్చగొట్టి గురుద్వారాను తగులబెట్టి ఠాకూర్ సింగ్, బాదల్ సింగ్, గొర్చరణ్ సింగ్ అనే ముగ్గురు సిక్కులను హత్య చేయించినట్లుగా మే 20న దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొంది సీబీఐ.
ఇందిరాగాంధీ హయాంలో జరిగిన 'ఆపరేషన్ బ్లూస్టార్'కు ప్రతిగా 1984లో ఆమెను సెక్యురిటీ సిబ్బంది హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. సిక్కులను ఎక్కడపెడితే అక్కడ ఊచకోత కోశారు. ఆరోజు జరిగిన హింసాకాండలో సుమారుగా 3000 మంది మృతి చెందారు. అల్లర్లలో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పాత్రపై సీబీఐ లోతైన దర్యాప్తు చేసింది. అల్లర్లలో జగదీశ్ గుంపులను రెచ్చగొట్టినట్లు మరింత విధ్వాంసానికి పాల్పడి, పలు హత్యలకు కారణమైనట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.
2000లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై నివేదిక సమర్పించిన నానావతి కమీషన్ అందులో జగదీశ్ టైట్లర్ ప్రత్యక్షంగానే అల్లరి మూకలను రెచ్చగొట్టే ప్రయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఆరోజున జగదీశ్ కారులో వచ్చి టీబీ హాస్పిటల్ గేటు వద్ద కత్తులు, రాడ్లు, కర్రలు చేత పట్టుకుని ఉన్న ఒక గుంపుతో మాట్లాడుతూ.. "మీరు చేసిన హింస సరిపోదు.. నాకైతే సంతృప్తికరంగా లేదు.. మరింత మంది సిక్కులని చంపండి పోయి.. లేదంటే నా మాట పోతుంది, పెద్ద ఎత్తున సిక్కులను హత్య చేయిస్తానని మాటిచ్చాను" అని చెప్పినట్లు తెలిపింది.
తాజాగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో ఒకామె జగదీశ్ టైట్లర్ గుంపును రెచ్చగొట్టడాన్ని కళ్లారా చూసినట్లు తెలిపింది. ఆరోజు తన దుకాణాన్ని అల్లరి మూకలు ధ్వంసం చేస్తుండడం చూసి వెనక్కి వెళ్లిపోతుండగా గురుద్వారా పుల్ బంగాశ్ వద్ద జగదీశ్ టైట్లర్ ఒక తెల్లటి అంబాసిడర్ కారులో వచ్చి అక్కడున్న దుండగలతో.. "ఆస్తులను తర్వాత కొల్లగొట్టవచ్చు.. ముందు దొరికిన సిక్కులను దొరికినట్టు చంపండి" అని రెచ్చగొట్టినట్లు సాక్ష్యమిచ్చింది.
అటుపై తాను ఇంటికి తిరిగొచ్చి పక్కింట్లో ఆశ్రయం పొందినట్లు అక్కడ తన భర్త వద్ద పనిచేసే శ్రీ గొర్చరణ్ సింగ్, శ్రీ బాదల్ సింగ్ మృతదేహాలను చూసినట్లు తెలిపింది. ఈ సాక్ష్యాలతో పాటు ఆనాడు ఎంపీగా ఉన్నజగదీష్ టైట్లర్‌పై సిక్కు వ్యతిరేక అల్లర్లలో అనేక నేరారోపణలున్నాయి. అందుకు తగిన ఆధారాలను సేకరించిన తర్వాతే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపింది. అల్లరి మూకలను రెచ్చగొట్టడం, సిక్కులను హత్య చేయించడం, గురుద్వారాను తగులబెట్టడం, 1984 నవంబర్ 1న నిషేధిత ఉతర్వులను ఉలంఘించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి నేరాలను అభియోగించింది సీబీఐ.
ఇది కూడా చదవండి: ఉత్తర భారతాన్ని వదలని వానలు
Comments
Please login to add a commentAdd a comment