ఒడిశా: గోరుచుట్టు మీద రోకలిపోటులా రైలు ప్రమాదం నుంచి తేరుకునేలోపే ఒడిశా ప్రభుత్వానికి మరో సమస్య వచ్చి పడింది. ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను సంరక్షించడంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటోంది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. మృతదేహాలను సంరక్షించడానికి తగిన సదుపాయాలు లేక ఇప్పటికే 187 మృతదేహాలను జిల్లా కేంద్రమైన బాలాసోర్ నుండి భువనేశ్వర్ కు తరలించారు. అక్కడ కూడా అదే సమస్య తలెత్తడంతో ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించింది.
శవాల నుండి దుర్వాసన...
ఒడిశా రైలు ప్రమాదం మొత్తం దేశాన్నే కుదిపేసింది. చాలా తక్కువ వ్యవధిలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురికావడంతో మృతుల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో చనిపోయినవారిని వారి బంధువులు గుర్తించే వరకు మృతదేహాలను సంరక్షించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే సంఘటన జరిగి రెండు రోజులు కావడంతోపాటు విపరీతంగా ఉన్న ఎండలకు శవాలు పాడైపోకుండా చూడటం శవాగార నిర్వాహకులకు కష్టసాధ్యంగా మారింది.
భువనేశ్వర్ కు మృతదేహాలు తరలింపు...
బాలాసోర్ శవాగారంలో తగినంత చోటు లేకపోవడంతో 187 మృతదేహాలను బాలాసోర్ నుండి భువనేశ్వర్ తరలించారు. భువనేశ్వర్లో కూడా శవాలను ఉంచడానికి తగినంత చోటు లేకపోవడంతో 110 మృతదేహాలను మాత్రమే అక్కడి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంచి మిగిలిన వాటిని క్యాపిటల్ హాస్పిటల్, అమ్రి హాస్పిటల్, సమ్ హాస్పిటల్, మరికొన్ని ప్రయివేటు హాస్పిటల్స్ కు తరలించారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో కూడా అక్కడ 40 మృతదేహాలు ఉంచే సౌకర్యం మాత్రమే ఉంది. మిగతావాటి నిర్వహణ వారికి కష్టంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్
Comments
Please login to add a commentAdd a comment