Odisha Sambalpur MLA Versus Woman Police Fight Viral - Sakshi
Sakshi News home page

వీడియో: ‘మహిళా పోలీస్‌ వర్సెస్‌ బీజేపీ ఎమ్మెల్యే’.. ఆరోపణలు, ఫిర్యాదులు

Published Thu, Feb 16 2023 2:21 PM | Last Updated on Thu, Feb 16 2023 3:22 PM

Odisha Sambalpur MLA Versus Woman Police Fight Viral - Sakshi

సంబల్‌పూర్‌: ఒడిషాలో ప్రధాన ప్రతిపక్ష నేతకు, ఓ మహిళా పోలీస్‌ అధికారిణికి మధ్య వాగ్వాదం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. బహిరంగంగా ఆమెపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ నేత జయనారాయణ్‌ మిశ్రా.. ఆమెను ఒక్కసారిగా తోసేశాడు. దీంతో ఆమె  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆమెనే తనను తోసేసిందంటూ మిశ్రా సైతం ఫిర్యాదు చేశాడు.

ఒడిషాలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు పిలుపు ఇచ్చింది బీజేపీ. ఈ క్రమంలో  సంబల్‌పూర్‌ కలెక్టరేట్‌ వద్ద బుధవారం  ఎమ్మెల్యే జయనారాయణ్‌ మిశ్రా నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ సమయంలో మిశ్రాకు, ధనుపలి స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంచార్జ్‌ అనితా ప్రధాన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అది ఒక్కసారిగా తీవ్రంగా మారి.. ఆయన ఆమెను తోసేశాడు. 

అనితా ఏం చెప్తోందంటే..  ఆయన నన్ను చూసి.. లంచాలు తీసుకుంటావంటూ విమర్శించాడు. నన్నొక దొంగగా వ్యాఖ్యానించారు. ఎందుకలా విమర్శిస్తారని అడిగితే.. ముఖం మీద చెయ్యేసి తోసేశారు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అయితే మిశ్రా ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. బీజేపీ మహిళా కార్యకర్తలను వేధించడం గురించే ఆమెను ప్రశ్నించాను. అసలు ఆమె ఎవరో కూడా అంతకు ముందు నాకు తెలియదు. నేనేం ఆమెను తోసేయలేదు. ఆమెనే నన్ను తోసేసిందని చెప్తున్నారు. 

ఈ ఇద్దరి ఫిర్యాదు మీద సంబల్‌పూర్‌ ఎస్పీ గంగాధర్‌ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, సమగ్ర నివేదిక వచ్చాకే ఏదైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారాయన. ఇక ఈ ఘటనను ప్రస్తావిస్తూ బీజేపీ.. నవీన్‌ పట్నాయక్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఓ అధికారి ఓ మంత్రిని కాల్చి చంపేశాడు. ఇప్పుడేమో ఓ పోలీస్‌ అధికారిణి ప్రతిపక్ష నేతపై దాడికి దిగింది. అసలు ఒడిషాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? అని నిలదీస్తోంది. మిశ్రా అసెంబ్లీలో ఎక్కడ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తారేమోననే భయంతోనే ఇలాంటి చర్యలకు పోలీసులను వుసిగొల్పుతోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోంది. 

మరోవైపు బీజేడీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మిశ్రా మీద హత్య కేసుతో సహా 14 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడేమో దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement