ఎస్పీ కార్యాలయం వద్ద బాధితురాలు సునీతా ప్రధాన్
భువనేశ్వర్: ‘సార్.. మా ప్రాణాలు కాపాడండి’ అంటూ వివాహిత సునీతా ప్రధాన్ గురువారం ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైన ఈమె భర్తతో కలిసి గంజాం జిల్లాలోని చికిటి సమితి, కె.నువాగాం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరాడ గ్రామంలో కొన్నాళ్ల నుంచి నివాసముంటోంది. అయితే కొన్నిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె భర్త చనిపోగా అప్పటి నుంచి తన ఐదేళ్ల కూతురితో కలిసి అత్త వారి ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి ఆమెని తన అత్త, ఆడపడుచు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఎస్పీకి తెలిపింది.
దీంతో పాటు తన అత్త నేర చరిత్ర కలిగిన మహేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం పెడుతున్నారని బాధితురాలు వాపోయింది. ఇదే విషయంపై తన తండ్రి వారిని ప్రశ్నించగా, అతనిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని ఆమె ఎస్పీ ఎదుట వాపోయింది. ఈ ఘటన పట్ల కె.నువాగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్పటికైనా తమ అత్తవారింటి నుంచి ముప్పు ఉందని, నిందితులపై చర్యలు చేపట్టాల్సిందిగా ఎస్పీని ఆమె కోరారు. అనంతరం ఎస్పీ పినాకి మిశ్రాకి ఫిర్యాదు పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment