తప్పిదాలను సరిచేసుకుంటున్నాం | Only a nation that knows its past can chart out its future says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

తప్పిదాలను సరిచేసుకుంటున్నాం

Published Sat, Nov 26 2022 5:06 AM | Last Updated on Sat, Nov 26 2022 10:46 AM

Only a nation that knows its past can chart out its future says PM Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ: ‘‘గుర్తింపుకు నోచుకోని యోధులను, అమర వీరులను భారత్‌ ఇప్పుడు స్మరించుకుంటోంది. తద్వారా పాత తప్పిదాలను సరి చేసుకుంటోంది. తన ఘన వారసత్వాన్ని పండుగలా జరుపుకుంటోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వలస పాలనలో రచించిన కుట్రపూరిత చరిత్ర వల్ల మన యోధులకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. 1670ల్లో  మొఘల్‌ సైన్యంపై పోరాడిన అహోం (అస్సాం) సైనికాధికారి లచిత్‌ బర్ఫూకన్‌ 400వ జయంతి వేడుకలు శుక్రవారం ఢిల్లీలో జరిగాయి. వాటిలో మోదీ ప్రసంగించారు. ‘‘దేశ చరిత్రంటే కేవలం బానిసత్వం గురించే కాదు. వీర సైనికుల పోరాటాలు, త్యాగాలు కూడా. చరిత్రంటే కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల పరిణామాలు మాత్రమే కాదు. నిరంకుశత్వం, దౌర్జన్యాలపై అసమాన ధైర్య సాహసాలతో జరిపిన పోరాటమే మన చరిత్ర’’ అన్నారు.

దేశం కంటే ఏ బంధమూ గొప్ప కాదు  
స్వాతంత్య్రానంతరం కూడా వలసవాద భావజాలం కొనసాగిందని, చరిత్రను కుట్రపూరితంగా లిఖించడం దురదృష్టకరమని మోదీ అన్నారు. ‘‘రక్త సంబంధం కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యమని లచిత్‌ భావించారు. తప్పు చేస్తే దగ్గరి బంధువులనూ శిక్షించారు. కుటుంబాన్ని, కుటుంబ వారసత్వాన్ని పక్కనపెట్టి దేశం కోసం నిస్వార్థంగా పని చేయాలని గొప్ప సందేశమిచ్చారు. దేశ ప్రయోజనాల కంటే ఏ బంధమూ గొప్ప కాదని ఆయన జీవితం బోధిస్తోంది’’ అన్నారు.

చిన్నారులతో ప్రచారం మోదీపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు
గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చిన్న పిల్లలను వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నట్లున్న ఓ చిన్నారి వీడియోను ప్రధానితోపాటు, కేంద్ర మంత్రులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంపై పార్టీ ప్రతినిధి బృందం ఈసీని కలిసింది. ‘‘ఇది పిల్లల హక్కులకు భంగం కలిగించడమే. తీవ్రమైన అంశమైనందున బాధ్యులపై చర్యలు తీసుకోండి’’ అ ని కోరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement