రుచికా మహంతి (ఫైల్)
వికృత ఆనందం మరోసారి పడగ విప్పింది. ర్యాగింగ్ భూతం పేరిట విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయమే వారిపాలిట మృత్యు పాశంగా మారింది. దీంతో మరో కుటుంబానికి గర్భశోకం మిగిలింది. ఈ సెగలు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అసెంబ్లీని సైతం కుదిపేశాయి. దీనిపై విచారణకు నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక కమిటీని నియమించారు.
భువనేశ్వర్: రాష్ట్ర రాజధాని నగరంలోని బక్షి జగబంధు(బీజేబీ) కళాశాల క్యాంపస్‌లో విద్యార్థి రుచికా మహంతి(19) ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. కళాశాల ఆవరణ నుంచి శాసనసభ వరకు ఆందోళన సెగలు విస్తరించాయి. రుచికా కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా రోదించారు. ఈ అమానుష చర్య విద్యార్థి సంఘాలు నిరసనకు దిగేలా చేశాయి. ఈ విచారకర పరిస్థితులను తొలగించేందుకు ప్రభుత్వం ఇంకెంత కాలం నిరీక్షిస్తుందని నిలదీస్తున్నాయి. రుచికా మహంతి ఆత్మహత్యకు ప్రేరేపించిన ర్యాగింగ్ వేధింపులకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు చేపడతామని కళాశాల యాజమాన్యం, పోలీస్ కమిషనరేట్ వర్గాలు యథాతధంగా భరోసా ఇస్తున్నాయి. ఈ రెండు వర్గాలు ఎవరి తరహాలో వారు ప్రత్యేక కమిఈలు ఏర్పాటు చేసి, విచారణ చేపట్టినట్లు సోమవారం ప్రకటించాయి.
తల్లిదండ్రుల నిరసన..
విద్యార్థి రుచికా మహంతి శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ చర్యలకు నిరసనగా ఆమె తల్లిదండ్రులు, కటుంబీకులు కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. వీరికి పలు విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించి, ధర్నాలో పాల్గొన్నారు. కటక్ జిల్లా అఠొగొడొ ప్రాంతం నుంచి బీజేబీ కళాశాల ఆర్ట్స్ విభాగం ప్లస్3 డిగ్రీ తొలి సంవత్సరం తరగతిలో రుచికా మహంతి ఇటీవల చేరింది. కళాశాల కరుబాకి హాస్టల్ 201వ నంబర్ గదిలో శనివారం రాత్రి ఉరి పోసుకుని మరణించినట్లు గుర్తించారు. ఆమె మరణ వాంగ్మూలం పోలీసులు గుర్తించినట్లు 4వ నంబర్ జోన్ ఏసీపీ పరేష్‌రౌత్ తెలిపారు. ముగ్గురు సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ తాళలేక రుచికా మహంతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఈ వాంగ్మూలంలో వివరించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల పేర్లు ఇతర వివరాలను పేర్కొనలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
కళాశాల విచారణ కమిటీ..
రుచికా మహంతి ఆత్మహత్య ఘటనపై విచారణ పురస్కరించుకుని ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటైంది. కళాశాల యాజమాన్యం దీనిని నియమించింది. ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ, క్రమశిక్షణ కమిటీ, అన్ని విభాగాల అధ్యాపకులతో ఏర్పాటు చేశారు. ర్యాగింగ్‌కు సంబంధించి రుచికా మహంతి గతంలో ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. త్వరలో ఈ విచారకర ఘటన పూర్వాపరాలు వెలుగు చూస్తాయని బీజేబీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిరంజన మిశ్రా తెలిపారు.
మరోవైపు ప్లస్3 డిగ్రీ చివరి సంవత్సరపు పరీక్షలను నిలిపి వేశారు. సోమవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కళాశాలలో నెలకొన్న ఉధ్రిక్తతతో సోమవారం, మంగళవారాల్లో జరగాల్సిన పరీక్షలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ప్రకటించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు సీనియర్ విద్యార్థులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘం, విద్యార్థిని కుటుంబీకులు నిరసన వ్యక్తం నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీలో..
రుచికా మహంతి ఆత్మహత్య ఘటన పురస్కరించుకుని విద్యార్థి కాంగ్రెస్ సోమవారం ఆందోళనకు దిగింది. ర్యాగింగ్ నివారణలో ప్రభుత్వ వైఫల్యమైందని నినాదాలతో శాసనసభలోకి చొరబడేందుకు ఆందోళనకారులు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుని ఉధ్రిక్తత నెలకొంది.
కమిషనర్ ఆధ్వర్యంలో..
బీజేబీ కళాశాల క్యాంపస్ కరిబాకి హాస్టల్ గదిలో విద్యార్థి రుచికా మహంతి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. డీïసీపీ హోదా అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో దీనిపై విచారణ చేపడుతుందని జంట నగరాల పోలీసు కమిషనర్ సౌమేంద్రకుమార్ ప్రియదర్శి వెల్లడించారు. మరోవైపు స్థానిక బర్‌గడ్ ఠాణా పోలీసులు ఈ సంఘటన పురస్కరించుకుని ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు ప్రకటించారు.
స్పందించిన హక్కుల కమిషన్
భువనేశ్వర్: స్థానిక బక్షి జగబంధు(బీజేజీ) కళాశాల క్యాంపస్ హాస్టల్ గదిలో ప్లస్3 డిగ్రీ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్య సంఘటన పురస్కరించుకుని సమగ్ర నివేదిక దాఖలు చేయాలని ఒడిశా మానవ హక్కుల కమిషనప్ సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి సీల్డ్ కవర్‌లో నివేదిక దాఖలు చేయాలని కటక్–భువనేశ్వర్ జంట నగరాల కమిషరేటు పోలీస్ వర్గాలకు కమిషన్ ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసినట్లు తెలిపింది. మీడియా ప్రసారం ఆధారంగా ఒడిశా మానవ హక్కుల కమిషన్ స్వయంగా చొరవ కల్పించుకుని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది.
నిందితుల్ని క్షమించేది లేదు: హోంశాఖ
భువనేశ్వర్: బీజేబీ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన పట్ల రాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి తుషార్‌కాంతి బెహరా సోమవారం స్పందించారు. నిందితుల్ని క్షమించేది లేదని ఆయన శాసనసభలో ప్రవేశ పెట్టిన వివరణలో పేర్కొన్నారు. విపక్షాల దాడితో ఈ ఘటనపై వివరణ సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ విక్రమకేశరి అరూఖ్ ఆదేశించారు. సభా కార్యక్రమాలు ముగిసే సమయానికి వివరణ దాఖలు చేయాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తుషార్‌కాంతి బెహరా మాట్లాడుతూ... ‘విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్య అత్యంత విచారకరం. పోలీసులు ఈ ఘటన పట్ల అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
తక్షణమే దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది’ అని ప్రకటించారు. దీనిపై బర్‌గడ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు కోసం కమిషనరేట్ పోలీసు 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. అదనపు డీసీపీ హోదా అధికారి ఈ బృందాలను పర్యవేక్షిస్తున్నారు. కుటుంబీకులు, మృతురాలి బంధువర్గం జారీ చేసిన సమాచారం, ఘటనా స్థలంలో లభ్యమైన మరణ వాంగ్మూలం వివరాలను దర్యాప్తు పరిధిలో ప్రధాన అంశాలుగా పరిగణించినట్లు మంత్రి తెలిపారు.
సభలో సమరమే..!
ర్యాగింగ్ తీవ్రతతో బీజేబీ కళాశాలలో విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనాత్మకంగా మారింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. ఈ విచారకర పరిస్థితుల పట్ల పూర్తి వివరణ సభలో ప్రవేశ పెట్టాలని సోమవారం జరిగిన వర్షాకాల సమావేశాల్లో సభ్యులు విరచుకు పడ్డారు. స్పీకర్ పోడియం వైపు దూసుకుపోయారు.
ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. విపక్షాల తీరుపట్ల అసహనం ప్రదర్శించిన స్పీకర్.. సభా కార్యక్రమాలను ఉదయం 11.30 గంటల వరకు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో సభలో ప్రశ్నోత్తరాల ఘట్టానికి గండి పడింది. జీరో అవర్‌లో దీనిపై చర్చిద్దామని సభాపతి విక్రమకేశరి అరూఖ్ సభ్యుల్ని అభ్యర్థించారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగనీయాలన్న స్పీకర్ పిలుపుని నిరాకరించడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు గుర్తించి, సభా కార్యక్రమాలను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment