సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను నిరశిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చసాగుతున్న తరుణంలో మరో అంశం కలకలం రేపుతోంది. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఘటన అనంతరం పెద్ద ఎత్తున రైతులు కనిపించకుండా పోయారనే వార్త దుమారం రేపుతోంది. ఈ మేరకు పంజాబ్ హూమన్ రైట్స్ సంస్థ శనివారం చేసిన ఓ ప్రకటన వివాదాస్పదంగా మారింది. ఈ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అభిప్రాయం ప్రకారం.. జనవరి 26 అనంతరం రాష్ట్రానికి చెందిన చాలామంది రైతు నిరసన కారులు అదృశ్యమయ్యారు. ఢిల్లీ హింసలో పాల్గొన్న దాదాపు 100 మంది రైతులు నాలుగు రోజులుగా కనిపించడంలేదని ఈ సంస్థ పేర్కొంది. (సరిహద్దుల్లో ఉద్రిక్తత: కేంద్రం మరో కీలక నిర్ణయం)
ఈ మేరకు పంజాబ్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 12 మంది రైతులు మిస్ అయ్యిన్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైందని తన రిపోర్టులో తెలిపింది. ముఖ్యంగా ఎర్రకోటపై జెండా ఎగరేసిన వారే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారని వివరించింది. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న 200 మంది రైతులపై కేంద్ర ప్రభుత్వం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పలువురిపై దేశద్రోహ కేసు కూడా నమోదు చేసింది. అయితే కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సేవలను అందించాలని పలు సంఘాలకు చెందిన ప్రముఖులు నిర్ణయించారు. ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న వారి తరఫున ఉచితంగా వాదనలు వినిపిస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment