ఢిల్లీ: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులు జరగనున్నాయనే సమాచారం అందడంతో ఢిల్లీలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రధాన రహదారులే లక్ష‍్యంగా దాడి చేయనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. లష్కరే-ఈ-తోయిబా(ఎల్‌ఈటీ), జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ బృందాలు తెలిపాయి.
దేశ రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే సూచనలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దేశంలో భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి.
గత ఫిబ్రవరిలోనే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరగనున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఢిల్లీలో ప్రధాన ప్రదేశాల్లో, రద్దీగా ఉండే స్థలాల‍్లో దాడులు చేపట్టాలని ఎల్‌ఈటీ తన సభ్యులకు సమాచారం పంపించినట్లు ఇంటెలిజెన్స్‌కు తెలిసింది. నేషనల్ ఇన్వెష్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ప్రధానం కేంద్రంపై దాడి చేసి భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది.
భారత్‌లో ప్రధాన నగరాల్లో దాడులు జరపాలని 2023 మేలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఓ వీడియో విడుదలైంది. పాక్ ఆధారిత ఉగ్రవాదులు, గ్లోబల్ జిహాదీలు స్వాతంత్య్ర వేడుకలే లక్ష‍్యంగా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
భద్రత కట్టుదిట్టం..
ఉగ్రదాడుల సమాచారంతో స్వాతంత్య్ర వేడుకలకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పెట్రోలింగ్ వ్యవస్థలను పెంచారు. ఢిల్లీలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వేడుకల్లో భద్రత కోసం దాదాపు 10,000 పోలీసులను మోహరించారు. 1000 ఫేస్ రికగ్నీషన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్, సర్వెలెన్స్‌ను పెంచారు. కాగా.. ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసం ఇస్తారు.
ఇదీ చదవండి: సీమా హైదర్ తిరంగ జెండా ఎత్తితే అట్లుంటది..! జేజేలు కొడుతూ.. దృశ్యాలు వైరల్..
Comments
Please login to add a commentAdd a comment