జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) పాకిస్థాన్‌కి చెందిన దంపతులు ఓటేశారు. పాకిస్థాన్ నుంచి వలస వచ్చి భారత పౌరసత్వం పొందిన ఈ జంట శనివారం జైపూర్‌లోని సంగనేర్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వైద్యులైన అశోక్, నిర్మలా మహేశ్వరి దంపతులు చివరిసారిగా 2013లో పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ తర్వాత మతపరమైన వేధింపులతో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌ను వదిలి 2014లో విజిటర్స్ వీసాపై తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చారు. ఎనిమిది సంవత్సరాల పాటు అధికారిక పరిశీలనలో గడిపిన తర్వాత వీరిద్దరూ 2022లో భారత పౌరసత్వం పొందారు. అయితే వీరి పిల్లలకు మాత్రం ఇంకా భారత పౌరసత్వం లభించలేదు.
భారతీయులమని గర్వంగా చెప్పుకొంటాం
సంగనేర్‌లోని విద్యాస్థలి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తొలిసారి ఓటేసి బయటకు వచ్చిన అశోక్, నిర్మలా మహేశ్వరి దంపతులు.. తాము ఇప్పుడు భారతీయులమని గర్వంగా చెప్పుకోగలమని భావోద్వేగానికి గురయ్యారు. వచ్చే ఏడాది జరిగే భారత పార్లమెంటరీ ఎన్నికలలోనూ ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నామని నిర్మల తెలిపారు. నిర్మల జనరల్ మెడిసిన్‌లో వైద్యురాలు కాగా అశోక్ అనస్థీషియాలజిస్ట్‌గా ఉన్నారు.
తమను ఓటు వేయడానికి భారత ప్రభుత్వం అనుమతించిందని తెలిసి పాకిస్తాన్‌లో ఉంటున్న తన తల్లి, సోదరులు సంతోషం వ్యక్తం చేశారని, తమను అభినందించారని నిర్మల పేర్కొన్నారు. ఏదో ఒక రోజు వారు కూడా తమ నిజమైన మాతృభూమి అయిన భారతదేశానికి తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే భారత్‌లో ఎన్నికల ప్రక్రియను ఆమె ప్రశంసించారు. తమకు పౌరసత్వం ఇచ్చినందుకు కేంద్రానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment