బీజేపీ ప‌ల్లవి డెంపో.. గోవాలో నయా హిస్టరీ.. | Pallavi Dempo Contest Lok Sabha On BJP Ticket From Goa | Sakshi
Sakshi News home page

బీజేపీ ప‌ల్లవి డెంపో.. గోవాలో నయా హిస్టరీ..

Published Mon, Mar 25 2024 10:45 AM | Last Updated on Mon, Mar 25 2024 12:53 PM

Pallavi Dempo Contest Lok Sabha On BJP Ticket From Goa - Sakshi

పనాజీ: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇదే సమయంలో అభ్యర్థుల ప్రకటన కీలకంగా మారింది. ఇక, తాజాగా గోవాలో బీజేపీ అభ్యర్థి ప‌ల్లవి డెంపో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశారు. గోవా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. 111 మందితో ఆదివారం జాబితాను విడుదల చేసింది. అందులో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప‌ల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బ‌రిలోకి దింపింది. 

దీంతో, రాష్ట్రంలో బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మొదటి మహిళగా ఆమె చరిత్రకెక్కారు. ప్రస్తుతం సౌత్ గోవా ఎంపీగా కాంగ్రెస్ నేత ఫ్రాన్సిస్కో స‌ర్దిన్హా ఉన్నారు. ఇదిలా ఉండగా.. 1962 నుంచి ఇప్పటి వ‌ర‌కు ఆ స్థానంలో 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించిండం విశేషం. 

ఇక, పల్లవి డెంపో.. పుణెలోని ఎంఐటీ నుంచి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ ప‌ట్టా కూడా అందుకున్నారు. ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా వ్యవరిస్తున్నారు. ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుంది. వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్‌టైల్ మ్యూజియం అయిన మోడా గోవా ఫౌండేషన్‌కు ఆమె ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త శ్రీనివాస్ డెంపో.. ఆయన ప్రస్తుతం గోవా చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీస్‌కు అధిప‌తిగా కొన‌సాగుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement