goa elections
-
బీజేపీ పల్లవి డెంపో.. గోవాలో నయా హిస్టరీ..
పనాజీ: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇదే సమయంలో అభ్యర్థుల ప్రకటన కీలకంగా మారింది. ఇక, తాజాగా గోవాలో బీజేపీ అభ్యర్థి పల్లవి డెంపో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. గోవా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. 111 మందితో ఆదివారం జాబితాను విడుదల చేసింది. అందులో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బరిలోకి దింపింది. దీంతో, రాష్ట్రంలో బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మొదటి మహిళగా ఆమె చరిత్రకెక్కారు. ప్రస్తుతం సౌత్ గోవా ఎంపీగా కాంగ్రెస్ నేత ఫ్రాన్సిస్కో సర్దిన్హా ఉన్నారు. ఇదిలా ఉండగా.. 1962 నుంచి ఇప్పటి వరకు ఆ స్థానంలో 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించిండం విశేషం. ఇక, పల్లవి డెంపో.. పుణెలోని ఎంఐటీ నుంచి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పట్టా కూడా అందుకున్నారు. ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా వ్యవరిస్తున్నారు. ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుంది. వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్టైల్ మ్యూజియం అయిన మోడా గోవా ఫౌండేషన్‌కు ఆమె ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త శ్రీనివాస్ డెంపో.. ఆయన ప్రస్తుతం గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా కొనసాగుతున్నారు. #WATCH | Goa: BJP releases 5th list of candidates for the upcoming Lok Sabha elections. On her candidature from South Goa, Pallavi Shrinivas Dempo says, "I am grateful to the BJP for this nomination and I accept this in deep humility... We will try our level best to win this… pic.twitter.com/7vDWZnecva — ANI (@ANI) March 24, 2024 -
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. న్యూస్ చానెల్ అధికారి అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది. ‘ఇండియా ఏహెడ్’ న్యూస్ చానెల్ కమర్షియల్ హెడ్, ప్రొడక్షన్ కంట్రోలర్ అర్వింద్ కుమార్ జోషిని అదుపులోకి తీసుకుంది. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ ప్రచార బాధ్యతలను చేపట్టిన చారియెట్ మీడియా సంస్థకు ఈయన హవాలా మార్గంలో రూ.17 కోట్లను బదిలీ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వాట్సాప్ చాటింగ్, హవాలా ఆపరేటర్ల రికార్డులు పరిశీలించిన తర్వాత జోషిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. చారియెట్ మీడియా యజమాని రాజేశ్ జోషిని ఫిబ్రవరిలోనే ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే, సరైన ఆధారాలను సమర్పించలేదంటూ మే 6న ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిలిచ్చింది. -
కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఓటేయొద్దు..
పనాజీ : దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో పోరు రసవత్తరంగా మారింది. పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుండగా.. మరి కొన్నిచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తమ సత్తా చాటేందుకు వినూత్న రీతిలో ముందుకు సాగుతోంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విభిన్న ఎత్తుగడులతో అధికార పార్టీలను ఇరుకున పెడుతున్నారు. తాజాగా గోవా రాజకీయ పరిణామాలపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 10న గోవా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, మార్చి 11వ తేదీన కాంగ్రెస్ నుంచి నేతలందరూ బీజేపీలో చేరుతారని అన్నారు. కాబట్టి బీజేపీ ఓడిపోవాలని కోరుకునే గోవా ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నాను.. కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు, వారి ఓటు వృధా అవడమే కాకుండా అది బీజేపీకే వెళ్తుందని తెలిపారు. మీ ఓట్లన్నీ ఆప్‌కి వేయండని గోవా ప్రజలను కేజ్రీవాల్ కోరారు ఈ క్రమలోనే తాము అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆరో నెలల్లోనే రాష్ట్రంలో మైనింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాల బీజేపీ పాలనలో గోవాలో మైనింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా గోవాలో సోమవారం (ఫిబ్రవరి 14న) ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. After results are announced on March 10, by March 11 all from Congress will join BJP. So I appeal to the people of Goa who want to see the BJP lose, don't vote for Congress. Their vote will go wasted, it will go to the BJP. Give all your votes to AAP: Arvind Kejriwal, AAP pic.twitter.com/zqgReiAoUv — ANI (@ANI) February 12, 2022 -
గోవాలో ఏం జరిగిందో తెలుసా?
రాజకీయాల్లో శషభిషలు పనికిరావన్న విషయం గోవాలో మరోసారి రుజువైంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువున్నా, వాళ్లు అవకాశాలను ఉపయోగించుకోలేకపోయారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలున్నాయి. అంటే మేజిక్ మార్కు 21. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు వచ్చాయి. బీజేపీ 14 చోట్ల గెలిచింది. అయితే.. రెండు చిన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవడంలో బీజేపీ జెట్ స్పీడుతో వ్యవహరించింది. అవి.. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ. ఈ రెండింటికీ మూడేసి చొప్పున స్థానాలు వచ్చాయి. దాంతో ఇద్దరు స్వతంత్రులతో కలిసి వీళ్ల మద్దతు కూడా తీసుకుని బీజేపీ తనకు కావల్సిన మెజారిటీని సంపాదించేసుకుంది. ఎన్నికలకు ముందున్న బీజేపీ ప్రభుత్వంలో తొలుత మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఉండేది. కానీ విజయ్ సర్దేశాయ్ నేతృత్వంలోని గోవా ఫార్వర్డ్ పార్టీ మాత్రం.. బహిరంగంగా బీజేపీని విమర్శించేది. మనోహర్ పరీకర్‌ను కూడా పొలిటికల్ ఫిక్సర్ అని వ్యాఖ్యానించేది. అయితే.. అదే సర్దేశాయ్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఎవరేం చేశారంటే... శనివారం మధ్యాహ్నానికి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం మనోహర్ పరీకర్, నితిన్ గడ్కరీ ఇద్దరూ గోవాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుని తీవ్రంగా మధనపడుతున్నారు. ఎంజీపీ మద్దతిచ్చేందుకు ముందుకొచ్చినా, జీఎఫ్‌పీ మాత్రం ఇంకా సరేనని చెప్పలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే విజయ్ సర్దేశాయ్ అక్కడకు వచ్చారు. అంతే ఒక్కసారిగా బీజేపీ బలం 19 నుంచి 22కు పెరిగిపోయింది. సరిగ్గా అదే సమయానికి అదే గోవాలోని మరో ఫైవ్ స్టార్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమై.. ముఖ్యమంత్రిగా ఎవరిని చేస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. అప్పటికే ఒకసారి జీఎఫ్‌పీ వాళ్లకు మద్దతిస్తామని ఆఫర్ చేసినా, నెమ్మదిగా చూసుకోవచ్చులేనని ఆగిపోయారు తప్ప సరిగా స్పందించలేదు. సరిగ్గా ఇదే వాళ్ల కొంప ముంచింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఐదుగురి పేర్లను అనుకున్నా, ప్రతి ఒక్కరికీ అవతలి వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. సాయంత్రానికి కాంగ్రెస్ నేతలు హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాన్ని ఢిల్లీ నేతలు సర్వనాశనం చేస్తున్నారని ఎమ్మెల్యే జెన్నిఫర్ మాన్సెరాటె మండిపడ్డారు. ఈ విషయం తెలియగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బీజేపీ నేతలు గవర్నర్ మృదులా సిన్హా వద్దకు వెళ్లిపోయి.. తమకు 22 మంది మద్దతు ఉందని, అందువల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాంతో అప్పుడు ఆలస్యంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రకాంత్ కవ్లేకర్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పింది. కానీ అప్పటికే జరగాల్సింది అంతా జరిగిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం పోయేందుకు తనదే బాధ్యత అని దిగ్విజయ్ సింగ్ భారంగా చెప్పారు. స్వతంత్ర సభ్యులిద్దరూ తమ పార్టీని మోసం చేశారని ఆయన ఆరోపించారు. ముందు రోజు ఏమైంది? శనివారం రాత్రి ఫలితాలు వెలువడిన తర్వాత జీఎఫ్‌పీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ స్వయంగా వెళ్లి దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే కామత్‌ను ముఖ్యమంత్రి చేయాలని షరతు పెట్టారు. దానికి దిగ్విజయ్ ఏమీ చెప్పలేదు. అలాగే సర్దేశాయ్ వచ్చిన విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చెప్పలేదు. ఈలోపు శనివారం రాత్రి గడ్కరీ గోవా వచ్చారు. వెంటనే ఎంజీపీ నేతలతో గంటలకొద్దీ మంతనాలు జరిపారు. వాళ్లు బీజేపీకి మద్దతిచ్చేందుకు సరేనన్నారు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. ఆ తర్వాత గడ్కరీ.. విజయ్ సర్దేశాయ్‌ని కలిశారు. కానీ అప్పటికి ఏమీ ఫలితం రాలేదు. ఆదివారం మధ్యాహ్నం సర్దేశాయ్ వద్దకు గడ్కరీ తన దూతను పంపి, ఆయన్ను మళ్లీ హోటల్‌కు తీసుకొచ్చారు. అక్కడ డీల్ కుదిరింది. కేబినెట్లో మూడు పదవులు ఇస్తామని ఆయనకు హామీ లభించడంతో విజయ్ సర్దేశాయ్ సరేనన్నారు. పరీకర్‌కు అద్భుతమైన పాలనా నైపుణ్యాలు ఉన్నాయని ప్రశంసించారు. అంతే, గోవాలో బీజేపీ ప్రభుత్వానికి బాటలు పడ్డాయి. -
ఎన్నికలెందుకు.. వేలం వేస్తే పోలా?
ఇంత ప్రజాధనం ఖర్చుచేసి ఎన్నికలు నిర్వహించడానికి బదులు ఎన్నికల కమిషన్ అసెంబ్లీ సీట్లను వేలం వేసి ఉండాల్సిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటుగా విమర్శించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తాము మాత్రం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రంలో పని చేస్తూనే ఉంటామని పార్టీ గోవా కన్వీనర్ ఎల్విస్ గోమెజ్ అన్నారు. గోవాలో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కనీసం అక్కడ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఇంత ఘోరమైన ఓటమి చవిచూసిన తర్వాత గోమెజ్ సోమవారం సాయంత్రం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఎవరు ఎన్నిక కావాలన్న విషయాన్ని నిర్ణయించడంలో డబ్బు చాలా కీలక పాత్ర పోషించిందని, డబ్బు ప్రభావాన్ని నియంత్రించడంలో ఎన్నికల కమిషన్ యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అసలు ఈ ఎన్నికలన్నీ ఎందుకు నిర్వహిస్తున్నారని ఒక్కోసారి తనకు ఆశ్చర్యం వేస్తుందని, దానికి బదులు ఎన్నికల కమిషన్ మొత్తం అన్ని సీట్లకు వేలం నిర్వహిస్తే సరిపోతుంది కదా అన్నారు. అందరికంటే ఎక్కువ పాట పాడుకున్నవాళ్లు గెలిచినట్లు ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం, ర్యాలీలు నిర్వహించడం ఇదంతా ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రజలకు ఏం కావాలో తమకు అర్థం కాలేదని గోమెజ్ అన్నారు. గోవా ప్రజలకు తాము సరైన ప్రత్యామ్నాయం ఇద్దామనుకున్నామని.. రాజకీయ యవనికపై తాము కొత్త ముఖాలను తీసుకొద్దామనుకున్నామని, అందుకే ఎలాంటి నేరచరిత్ర లేని అభ్యర్థులకే టికెట్లు ఇచ్చామని తెలిపారు. అలాగే కులమతాల ఆధారంగా కూడా టికెట్లు ఇవ్వలేదన్నారు. ఇవన్నీ కాకుండా ప్రజలకు ఏం కావాలో తమకు తెలియలేదని, ప్రజలను మరింత బాగా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. -
'కేజ్రీవాల్‌ను పట్టించుకోను.. అతనంతే'
పనాజీ: త్వరలో ఎన్నికల నేపథ్యంలో గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. విపక్షాల ఆరోపణలకు అధికార పక్షం వ్యూహాత్మకంగా సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టింది. డబ్బులు ఇచ్చి ఓట్లర్లను మభ్యపెడుతున్నారన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాటలను తాను అస్సలు పట్టించుకోనని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. కేజ్రీవాల్ ఎక్కడ సభలకు వెళ్లినా సంచలనం కోసం ప్రయత్నిస్తాడే తప్ప అందులో వాస్తవాలు ఉండవని, అందుకే తాను ఆయన మాటలను పట్టించుకోనని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఓటర్లను మభ్యపేట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సంచలనాలు సృష్టిద్దామన్న మోజులో కేజ్రీవాల్ ఇతర పార్టీలపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు పంచుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. డబ్బులు ఇచ్చేందుకు ఏ పార్టీ వచ్చినా వారి దగ్గర నుంచి తీసుకోవాలని ఓట్లు మాత్రం ఆమ్ ఆద్మీపార్టీకి వేయాలని ఢీల్లీ సీఎం ఓటర్లకు సూచించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోపక్క, కేజ్రీవాల్ తన మాటలను వెనక్కు తీసుకోని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆప్ తరపున గోవాలో ఎల్విస్ గోమ్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఏడాది జూలైలో గోవా సివిల్ సర్వీస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఫిబ్రవరి 4న గోవాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
హలో చెప్పరు.. కాల్చిపారేయండి!
‘మీ వెనక మేమున్నాం. ఎవరైనాసరే, ఆయుధాలతో కనిపిస్తే.. వాళ్లొచ్చి హలో చెబుతారనే అనుకోవద్దు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విచక్షణా రహితంగా కాల్చిపారేయండి’ అని సైనికుల్లో ధైర్యం నూరిపోశానని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ చెప్పారు. కశ్మీర్ సహా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లు.. శత్రువులను మట్టుపెట్టేందుకు ఫుల్ పవర్స్ ఉన్నాయని, ఆ మేరకు మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారం సాయంత్రం గోవాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పమాట్లాడిన పరీకర్.. కాంగ్రెస్ హయాంలో జవాన్ల కాళ్లకు బంధనాల్లాంటి నిబంధనలు ఉండేవని అన్నారు. ‘కాంగ్రెస్ హయాంలో విచిత్రమైన నిబంధనలు ఉండేవి. సాయుధులు ఎదురుపడిన సందర్భంలో ముందుగా వాళ్లు కాల్పులు జరిపితేగానీ మన జవాన్లు కాల్చకూడదనే రూల్ ఉండేది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిబంధనలో మార్పులు చేశారు. ఎవరైనాసరే, తుపాకులు, మారణాయుధాలతో సంచరిస్తే వారిని జవాన్లు కాల్చిపారేయొచ్చని సూచించారు. ఇది సైనికుల మనోస్థైర్యాన్ని రెట్టిపు చేసింది’అని పరీకర్ వ్యాఖ్యానించారు. కీలకమైన రక్షణ శాఖ నిర్వహణ అంత సులువేమీ కాదని, శాఖ పనితీరును అర్థం చేసుకోవడానికి కనీసం ఎనిమిది నెలలు పట్టిందని మంత్రి చెప్పారు. పాక్ చెరలోని భారత జవాన్ క్షేమం! పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిన తర్వాతి రోజుల్లో పొరపాటున దాయాది సరిహద్దుల్లోకి వెళ్లిన భారత జవాన్ చందు చౌహాన్ జాడపై రక్షణ మంత్రి పరీకర్ కీలక సమాచారం వెల్లడించారు. చందు చౌహాన్ పాక్ లోనే సజీవంగా, క్షేమంగా ఉన్నాడని, అతని విడుదలకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేసినట్లు మంత్రి చెప్పారు. సోమవారం ముంబై తీరంలో ఐఎన్ఎస్ చెన్నై నౌకను జలాల్లోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
దోపిడీదొంగలు వస్తున్నారు.. జాగ్రత్త!
గోవా ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటూ చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై రక్షణ మంత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఘాటుగా విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి కొంతమంది దోపిడీదారులు గోవాకు వస్తున్నారని, గోవాను దోచుకోడానికే వాళ్లు వస్తున్నారని, వాళ్లతో గోవా వాసులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘‘కొంతమంది ఢిల్లీవాలాలు ఢిల్లీని దోచుకున్న తర్వాత గోవాను కూడా దోచుకోవాలని చూస్తున్నారు. ఓ అవకాశం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. వాళ్లు కాకపోతే.. వాళ్ల ప్రైవేటు సెక్రటరీలు దోచుకుంటారు. ఆ ప్రైవేటు సెక్రటరీలు కమీషన్ల కోసమే చూస్తారు’’ అంటూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్‌పై కూడా విమర్శలు చేశారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ జన్మదినం సందర్భంగా జరిగిన సభలో పారికర్ మాట్లాడారు. గోవా సంపద మీద చాలా మంది కళ్లు ఉన్నాయని.. అందువల్ల గోవా వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను ఇక్కడికొస్తే బీజేపీని ఓడించాలన్న వాళ్ల కుట్రలు భగ్నమవుతాయని.. అందుకే తాను వస్తున్నానంటే వాళ్లకు కడుపు మంట అని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలో ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ రెండుసార్లు పర్యటించారు.