'కేజ్రీవాల్‌ను పట్టించుకోను.. అతనంతే'
పనాజీ: త్వరలో ఎన్నికల నేపథ్యంలో గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. విపక్షాల ఆరోపణలకు అధికార పక్షం వ్యూహాత్మకంగా సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టింది. డబ్బులు ఇచ్చి ఓట్లర్లను మభ్యపెడుతున్నారన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాటలను తాను అస్సలు పట్టించుకోనని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. కేజ్రీవాల్ ఎక్కడ సభలకు వెళ్లినా సంచలనం కోసం ప్రయత్నిస్తాడే తప్ప అందులో వాస్తవాలు ఉండవని, అందుకే తాను ఆయన మాటలను పట్టించుకోనని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఓటర్లను మభ్యపేట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
సంచలనాలు సృష్టిద్దామన్న మోజులో కేజ్రీవాల్ ఇతర పార్టీలపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు పంచుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. డబ్బులు ఇచ్చేందుకు ఏ పార్టీ వచ్చినా వారి దగ్గర నుంచి తీసుకోవాలని ఓట్లు మాత్రం ఆమ్ ఆద్మీపార్టీకి వేయాలని ఢీల్లీ సీఎం ఓటర్లకు సూచించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోపక్క, కేజ్రీవాల్ తన మాటలను వెనక్కు తీసుకోని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆప్ తరపున గోవాలో ఎల్విస్ గోమ్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఏడాది జూలైలో గోవా సివిల్ సర్వీస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఫిబ్రవరి 4న గోవాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.