హలో చెప్పరు.. కాల్చిపారేయండి!
‘మీ వెనక మేమున్నాం. ఎవరైనాసరే, ఆయుధాలతో కనిపిస్తే.. వాళ్లొచ్చి హలో చెబుతారనే అనుకోవద్దు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విచక్షణా రహితంగా కాల్చిపారేయండి’ అని సైనికుల్లో ధైర్యం నూరిపోశానని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ చెప్పారు. కశ్మీర్ సహా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లు.. శత్రువులను మట్టుపెట్టేందుకు ఫుల్ పవర్స్ ఉన్నాయని, ఆ మేరకు మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారం సాయంత్రం గోవాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పమాట్లాడిన పరీకర్.. కాంగ్రెస్ హయాంలో జవాన్ల కాళ్లకు బంధనాల్లాంటి నిబంధనలు ఉండేవని అన్నారు.
‘కాంగ్రెస్ హయాంలో విచిత్రమైన నిబంధనలు ఉండేవి. సాయుధులు ఎదురుపడిన సందర్భంలో ముందుగా వాళ్లు కాల్పులు జరిపితేగానీ మన జవాన్లు కాల్చకూడదనే రూల్ ఉండేది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిబంధనలో మార్పులు చేశారు. ఎవరైనాసరే, తుపాకులు, మారణాయుధాలతో సంచరిస్తే వారిని జవాన్లు కాల్చిపారేయొచ్చని సూచించారు. ఇది సైనికుల మనోస్థైర్యాన్ని రెట్టిపు చేసింది’అని పరీకర్ వ్యాఖ్యానించారు. కీలకమైన రక్షణ శాఖ నిర్వహణ అంత సులువేమీ కాదని, శాఖ పనితీరును అర్థం చేసుకోవడానికి కనీసం ఎనిమిది నెలలు పట్టిందని మంత్రి చెప్పారు.
పాక్ చెరలోని భారత జవాన్ క్షేమం!
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిన తర్వాతి రోజుల్లో పొరపాటున దాయాది సరిహద్దుల్లోకి వెళ్లిన భారత జవాన్ చందు చౌహాన్ జాడపై రక్షణ మంత్రి పరీకర్ కీలక సమాచారం వెల్లడించారు. చందు చౌహాన్ పాక్ లోనే సజీవంగా, క్షేమంగా ఉన్నాడని, అతని విడుదలకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేసినట్లు మంత్రి చెప్పారు. సోమవారం ముంబై తీరంలో ఐఎన్ఎస్ చెన్నై నౌకను జలాల్లోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.