కొనసాగుతున్న బందీల విడుదల ప్రక్రియ
గాజాలో వెల్లివిరిసిన ఆనందం
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరువైపులా బందీల విడుదల ప్రక్రియ రెండోదఫా సజావుగా సాగింది. పెద్ద సంఖ్యలో తమ వాళ్లు ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలకావడంతో వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లా నగరంలో పాలస్తీనియన్లు సంబరాలు చేసుకున్నారు. నలుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులు కరీనా అరీవ్(20), డేనియెలా గిల్‌బోవా(20), నామా లెవీ(20), లిరి అల్బాగ్(19)లను హమాస్ సాయుధులు విడిచిపెట్టారు.
ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ సైతం తమ కారాగారాల్లోని 200 మంది పాలస్తీనియన్లను వదలిపెట్టింది. వెస్ట్‌బ్యాంక్‌లోని ఒఫెర్ జైలు నుంచి బయటకొచ్చిన ఖైదీలను జెరూసలేం, రమల్లా సిటీలకు తరలించారు. విడుదలైన 200 మంది బస్సుల్లో బయల్దేరారు. ఈ 200 మందిలో 121 మంది జీవితఖైదు పడిన వాళ్లు ఉన్నారు. వీళ్లంతా గతంలో ఇజ్రాయెలీలపై దాడులకు పాల్పడ్డ నేరాలకు ఇజ్రాయెల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. విడుదలైన వారిలో కరుడుగట్టిన ఉగ్రవాదులు మొహమ్మద్ ఓదేహ్(52), వేయిల్ ఖాసిమ(54) సైతం ఉన్నారు.
విడుదలైన 200 మందిలో 70 మందిని బహిష్కరించి ఈజిప్ట్ కు పంపేశారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకిరావడంలో ఈజిప్ట్ కీలక మధ్యవర్తిగా ఉన్న నేపథ్యంలో కొందరు ఖైదీలను ఈజిప్ట్ కు తరలించినట్లు అక్కడి ఖహేరీ టీవీ పేర్కొంది. అంతకుముందు ఈ నలుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులను గాజా సిటీలోని పాలస్తీన్ స్క్వేర్ వద్ద రెడ్‌క్రాస్ బృందానికి హమాస్ సాయుధులు అప్పగించారు.
ఈ మహిళలు పూర్తి ఆరోగ్యంతో, నవ్వుతూ అక్కడి వేలాది మంది స్థానికులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. వీళ్ల రాకను ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగర వీధుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లపై చూసిన వందలాది మంది స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ‘‘నమ్మలేకపోతున్నా. వాళ్లు అలా విడుదలకావడం చూసి మనసు ఉప్పొంగింది. యుద్ధం శాశ్వతంగా ఆగిపోతే ఎంత బాగుంటుందో’’అని సంబరాలు చేసుకున్న అవీవ్ బెర్కోవిచ్ అనే స్థానికుడు ఆనందం వ్యక్తంచేశారు. ఈ మహిళా సైనికులు సురక్షితంగా తమ ఆర్మీ స్థావరానికి చేరుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం ధృవీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment