
ఫైల్ ఫోటో
సమాజంలో లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. తల్లి కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించేవాళ్లు నేటికి లేకపోలేదు. స్త్రీ పురుష సమానత్వం కోసం ఎంత పోరాడినా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందండం లేదు. అయితే ఇందుకు భిన్నంగా కూతురు పుట్టినందుకు ఓ వ్యక్తి తెగ సంబరపడిపోయాడు. ఆడపిల్లను మహాలక్ష్మిలా భావించి సంతోషంతో వేల రూపాయలు ఖర్చు చేశాడు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని కోలార్‌కి చెందిన అంచల్ గుప్తా అనే పానీ పూరి వ్యాపారికి ఆగస్టు 17న కూతురు పుట్టింది. ఆడపిల్లలతోనే భవిష్యత్తు బాగుంటుందని నమ్మే అంచల్‌కు కూతురు పుట్టిందన్న విషయం తెలియడంతో ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాడు.
గుర్తుగా ఏమైనా చేయాలనుకున్నాడు. దీంతో ఆదివారం కోలార్ పట్టణంలో రూ.50వేల ఖర్చు చేసి స్థానికులందరికీ ఉచితంగా పానీపూరి అందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఆడపిల్ల పుట్టడం ఒక కల. నేను వివాహం చేసుకున్నప్పటి నుంచి నాకు అమ్మాయే పుట్టాలని కోరుకున్నా. కానీ మొదటి సంతానంలో రెండేళ్ల క్రితం కొడుకు జన్మించాడు. అయితే అదృష్టం బాగుండి ఈ ఆగష్టు 17న కూతురు జన్మించింది. నిన్న నా కొడుకు రెండవ పుట్టినరోజు. ఈ సమయంలోనే నాకు కుమార్తె జన్మించిందని ప్రకటిస్తూ భోపాల్ ప్రజలకు ఉచిత పానీ పూరీని అందించాలని నిర్ణయించుకున్నాను.
చదవండి: వైరల్: కిమ్ జోంగ్ హెయిర్ కట్ కావాలి.. చివరికి ఏమైందంటే!
అంతేగాక వారికి అమ్మాయిలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందనేనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. నాకు చేతనైనంతలో ఏం చేద్దామని ఆలోచించి.. చివరకు ఉచిత పానీపురి పంపిణీ చేయాలనుకున్నాను. తద్వారా సమాజంలో ఆడపిల్లలు, మగపిల్లలు ఇరువురు సమానమేనని.. వివక్షకు తావు లేదని చెప్పదలుచుకున్నాను.' అని తెలిపారు. ఏదేమైనా అంచల్ గుప్తా చేసిన ఈ ప్రయత్నం స్థానికంగానే కాదు దేశవ్యాప్తంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. అతని నిర్ణయాన్ని చాలా మంది అభినందించారు. ఇలాంటి తండ్రులు ఇప్పటి సమాజానికి అవసరమని అభిప్రాయపడుతున్నారు.
చదవండి: వైరల్: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క.. గ్యాప్ కూడా ఇవ్వలే..
Comments
Please login to add a commentAdd a comment