సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థిని శ్రీమతి (17) అనుమానాస్పద మృతిపై ఆమె తల్లిదండ్రులు అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ సీఎంను కలిసేందుకు ఈనెల 26వ తేదీన కడలూరు నుంచి పాదయాత్రగా చెన్నైకి చేరుకోవాలని నిర్ణయించారు. వివరాలు.. కడలూరు జిల్లా వేప్పూరు సమీపం పెరియనేశలూరుకు చెందిన రామలింగం కుమార్తె శ్రీమతి (17) కల్లకురిచ్చి జిల్లా చిన్నసేలంలోని కనియమూర్ శక్తి మెట్రిక్యులేషన్ పాఠశాలలో ప్లస్–2 విద్యార్థిని. గతనెల 13వ తేదీన పాఠశాల ప్రాంగణంలో ఆ యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు, విధ్వంసకాండకు దారితీసింది. ఈ కేసు సీబీసీఐడీ చేతుల్లోకి వెళ్లగా స్కూలు ప్రిన్సిపల్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం జరిగిన తరువాత మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నం చేయగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు నిరాకరించాయి. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పుదుచ్చేరి జిప్మర్ ఆసుపత్రి వైద్యుల బృందం పర్యవేక్షణలో మరోసారి పోస్టు మార్టం చేశారు.
న్యాయస్థానం జోక్యంతో ఎట్టకేలకూ మృతదహాన్ని తీసుకుని అంతిమ సంస్కారం పూర్తిచేశారు. జిప్మర్ వైద్యులు పోస్టుమార్టం నివేదికను విళుపురం కోర్టుకు ఈనెల 21వ తేదీన సమర్పించారు. జిప్మర్ వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం వీడియో, నివేదిక నకలను తమకు సమర్పించాలని శ్రీమతి తల్లిదండ్రులు ఈనెల 22వ తేదీన కోర్టును లిఖితపూర్వకంగా కోరగా, న్యాయమూర్తి పుష్పరాణి ఇందుకు సమ్మతించారు.
సీఎంను కలిసేందుకు..
ఈ సందర్భంగా శ్రీమతి తల్లి సెల్వి విళుపురంలో మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె మృతిపై నెలకొన్న అనుమానాలను నెలరోజులు దాటినా నివృత్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో రహస్యంగా ఓ స్నేహితురాలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసిందని, అయితే ఆమె నిజంగా నా కుమార్తె స్నేహితురాలేనా..? అని నిర్ధారించుకునేందుకు వివరాలు కావాలని కోరారు. సూసైడ్ నోట్‌లో సంతకం శ్రీమతిది కాదని, అది ఎవరిదో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.
సీఎం స్టాలిన్ ఫోన్ మాట్లాడినప్పుడు నేరుగా కలుసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీన తమ స్వగ్రామమైన కడలూరు జిల్లా పెరియనేశలూరు నుంచి తన భర్తతో కలిసి పాదయాత్రగా చెన్నైకి చేరుకుని సీఎం స్టాలిన్‌ను కలుసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇక శ్రీమతి తల్లిదండ్రులు ఈనెల 27న సీఎంను కలుసుకునే అవకాశం కల్పించినట్లు చెన్నై సచివాలయ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: ఒకే కుటుంబంలో ఐదుగురిని కాటేసిన పాము
Comments
Please login to add a commentAdd a comment