న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. ముందుగా ఈ నెల 9వ తేదీ శుక్రవారం వరకే సమావేశాలు జరుగుతాయని ప్రకటించినప్పటికీ తాజాగా శనివారం కూడా సెషన్ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రకటించారు.
కాగా, యూపీఏ పదేళ్ల పాలనలో అస్తవ్యస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందన్న పుకార్ల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల పొడిగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. పదేళ్ల యూపీఏ పాలనలో అవలంబించిన అస్తవ్యస్థమైన ఆర్థిక విధానాలు, అవినీతి వల్ల దేశం చాలా విలువైన పదేళ్ల కాలాన్ని కోల్పోయిన వైనాన్ని మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ఎండగట్టనున్నట్లు సమాచారం.
యూపీఏ పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత్ తీసుకొని ఉండాల్సిన చర్యలు కూడా శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యూపీఏ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment