
న్యూఢిల్లీ: అమర గాయని లతా మంగేష్కర్ స్మృత్యర్థం పార్లమెంటు ఉభయసభలు సోమవారం గంటపాటు వాయిదా పడ్డాయి. లత మరణం సంగీతానికి, కళా రంగానికి తీరని లోటని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అన్నారు. ‘‘పాటల ఆత్మతో తాదాత్మ్యం చెందడం లతకే సొంతమైన విద్య. అందుకే ఆమె పాటలన్నీ మాస్టర్‌పీస్‌లుగా నిలిచిపోయాయి’’ అంటూ కొనియాడారు. లత స్వరం దశాబ్దాల పాటు దేశాన్ని మంత్రముగ్ధం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘దేశ ఐక్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని లత బలోపేతం చేశారు. ఆమె 36 భాషల్లో పాడిన తీరే దేశ ఐక్యతకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ’’ అని కొనియాడారు. మెలోడీ క్వీన్ మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటని స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
ఇండోర్‌లో లత అకాడమీ
లత జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్‌లో ఆమె జన్మస్థలం ఇండోర్‌లో సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ మొక్క నాటారు. ఇండోర్‌లో లత విగ్రహం, ఆమె పాటలతో మ్యూజియం, ఆమె పేరిట కాలేజీ, మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏటా లత జయంతి నాడు ఆమె పేరుతో అవార్డు ఇస్తామని చెప్పారు. లత అస్థికలను అల్లుడు ఆదినాథ్ సేకరించారు. వాటిని ఎక్కడ కలుపుతారనే దానిపై స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment