న్యూఢిల్లీ: లోక్‌సభలో అలజడి సృష్టించిన నిందితులు తొలుత సులువుగా మంటలంటుకునే జెల్ వంటిది ఒంటినిండా పూసుకుని తమను తాము తగలబెట్టుకుందామని అనుకున్నారట. పార్లమెంటు లోపలికి చొచ్చుకెళ్లి సభ్యులందరికీ అందేలా కరపత్రాలు విసిరితే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారట. ‘‘తమ నిరసనను, తాము ఇవ్వదలచిన సందేశాన్ని వీలైనంత ప్రభావవంతంగా ప్రభుత్వానికి, ప్రజలకు చేర్చేందుకు ఇలాంటి పలు అవకాశాలను పరిశీలించారు.
చివరికి లోక్‌సభలోకి దూకి పొగ గొట్టాలు విసిరి అలజడి సృష్టించాలని నిర్ణయించుకుని అమలు చేశారు’’అని నిందితులను విచారిస్తున్న పోలీసు బృందంలోని అధికారి ఒకరు వెల్లడించారు. గత బుధవారం లోక్‌సభ లోపల, బయట పొగ గొట్టాలు విసిరిన కలకలం రేపిన సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు.
లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్‌చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లనున్నారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించనున్నారు.
పార్లమెంటు భద్రతపై సమీక్షకు కమిటీ: స్పీకర్ ఓం బిర్లా
పార్లమెంటు భద్రతపై తాను కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్టు లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు. ఇలాంటి భద్రతా వైఫల్యాలు పునరావృతం కాకుండా అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించి దాన్ని కట్టుదిట్టం చేసేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను కమిటీ సూచిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభ సభ్యులకు ఆయన లేఖ రాశారు. దీనిపై కేంద్ర హోం శాఖ నియమించిన విచారణ కమిటీ నివేదికను కూడా సభ ముందుంచుతామని తెలిపారు.
ఇల్లు వదిలి వెళ్లకండి
మైసూరు: పార్లమెంటులో అలజడి సృష్టించిన కేసులో నిందితుడు మనోరంజన్ కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని కేంద్ర నిఘా విభాగం అధికారులు ఆదేశించారు. మైసూరు విజయనగరలోని మనోరంజన్ ఇంటిని నిఘా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి విప్లవ సాహిత్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మనోరంజన్ కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లవద్దని ఆదేశించారు. అత్యçవసర పరిస్థితి వస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. బంధువులు, ఇతరులెవరూ ఆ ఇంటికి వెళ్లరాదని, ఎవరైనా ఫోన్లు చేస్తే సంబంధిత వివరాలను అందజేయాలని సూచించారు.
మహేశ్‌కు ఏడు రోజుల కస్టడీ
ఈ కేసులో అరెస్టయిన ఆరో నిందితుడు మహేశ్ కుమావత్‌ను ఢిల్లీ కోర్టు శనివారం ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. అతడు కనీసం రెండేళ్లుగా ఈ కుట్రలో నిందితులకు సహకరిస్తున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీన్ని పూర్తిగా ఛేదించాలంటే అతన్ని లోతుగా విచారించాల్సి ఉందన్నారు. దాంతో ప్రత్యేక జడ్జి హర్‌దీప్ కౌర్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై మహేశ్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత్‌తో పాటు అతను తనంత తానుగా లొంగిపోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment