మోదీ చక్రవ్యూహంలో దేశం | Parliament Session 2024: Rahul Gandhi slams Union Budget 2024 | Sakshi
Sakshi News home page

మోదీ చక్రవ్యూహంలో దేశం

Published Tue, Jul 30 2024 4:36 AM | Last Updated on Tue, Jul 30 2024 4:36 AM

Parliament Session 2024: Rahul Gandhi slams Union Budget 2024

అంబానీ, అదానీలకే దోచిపెడుతోంది

లోక్‌సభలో రాహుల్‌ నిప్పులు 

చక్రవ్యూహం వెనుక ఆరుగురు

ఛేదించి తీరతామని వ్యాఖ్య

న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై విపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం ముప్పేట దాడి చేశారు. ‘‘దేశమంతటా తీవ్ర భయోత్పాత వాతావరణాన్ని నెలకొల్పారు. దేశంపై ప్రధాని మోదీ పెను సమస్యల చక్రవ్యూహం పన్నారు. అది దేశమంతటినీ సర్వనాశనం చేస్తోంది’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చలో మాట్లాడిన రాహుల్‌ మోదీపైనా, ఎన్డీఏ ప్రభుత్వ పాలనపైనా సునిశిత విమర్శలు చేశారు. ఘాటైన పదజాలంతో కూడిన పదునైన వ్యాఖ్యలు చేశారు.

 అధికార పక్ష సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించినా, నిబంధనలు అనుమతించబోవంటూ స్పీకర్‌ ఓం బిర్లా పదేపదే వారిస్తున్నా వెనక్కు తగ్గలేదు. బడ్జెట్‌ కేవలం బడా వ్యాపారవేత్తలకు ప్రయోజనాలకు, సర్కారు రాజకీయ గుత్తాధిపత్యానికి కొమ్ము కాసేలా ఉదంటూ విమర్శించారు. ‘‘ఈ మోదీ మార్కు సమస్యల చక్రవ్యూహాన్ని విపక్ష ఇండియా కూటమి ఛేదిస్తుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు, దేశవ్యాప్తంగా కులగణనకు సభ ఆమోదం లభించేలా చేసి తీరుతుంది’’ అని ప్రకటించారు. 

అభిమన్యుడిలా దేశం... 
నేటి హరియాణాలోని కురుక్షేత్రలో వేల ఏళ్ల కింద జరిగిన యుద్ధంలో ఆరుగురు ఒక్కటై చక్రవ్యూహం పన్ని బాలుడైన అభిమన్యున్ని పొట్టన పెట్టుకున్నారంటూ మహాభారత గాథను రాహుల్‌ ఉటంకించారు. ‘‘హింస, భయోద్వేగాలతో కూడిన చక్రవ్యూహమది. దాన్ని పద్మవ్యూహమని కూడా అంటారు’’ అంటూ బీజేపీ ఎన్నికల గుర్తు కమలాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. ‘‘నేడు 21వ శతాబ్దంలో మన దేశంపై మోదీ ఓ నయా చక్రవ్యూహాన్ని పన్నారు. అభిమన్యునికి పట్టిన గతినే దేశానికి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

దేశ యువతను, రైతులను, మహిళలను, చిన్న, మధ్యతరహా వ్యాపారులను సర్వనాశనం చేసేందుకు రాత్రింబవళ్లు ప్రయతి్నస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు కేంద్ర స్థానంలో ఉండి చక్యవ్యూహాన్ని నియంత్రిస్తున్నారు. వాళ్లు మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పారిశ్రామికవేత్తలు అంబానీ–అదానీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌’’ అని చెప్పుకొచ్చారు. చివరి నలుగురూ సభలో లేనందున వారి పేర్ల ప్రస్తావనను అనుమతించబోనని స్పీకర్‌ స్పష్టం చేశారు. 

దాంతో అనంతరం ఆరుగురి పేర్లనూ రాహుల్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. రాహుల్‌ ప్రసంగం పొడవునా అధికార ఎన్డీఏ కూటమి సభ్యులంతా పెద్దపెట్టున నిరసనలకు దిగారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు జోక్యం చేసుకోబోయారు. కానీ రాహుల్‌ అందుకు అవకాశమివ్వలేదు. సభలో లేనివారి పేర్లు ప్రస్తావించొద్దని స్పీకర్‌ స్పష్టం చేయడంతో అంబానీ, అదానీలను తన ప్రసంగం పొడవునా ఏ1, ఏ2గా సంబోధించారు. ‘‘ఏ1, ఏ2లను కాపాడేందుకు రిజిజు కూడా ప్రయతి్నస్తున్నారు. మీరిలా చేస్తే మాకే లాభం. వారిద్దరినీ ఇంకెంతగా కాపాడే ప్రయత్నం చేస్తారో చేయండి’’ అంటూ ఎద్దేవా చేశారు. 

చక్రవ్యూహం... మూడు శక్తులు 
మోదీ చక్రవ్యూహం వెనక మూడు శక్తులున్నాయని రాహుల్‌ అన్నారు. ‘‘మొదటిది గుత్తాధిపత్య ధోరణి. దేశ సంపదనంతా ఏ1, ఏ2 (అంబానీ, అదానీ) ఇద్దరికే మాత్రమే దోచిపెట్టే ప్రయత్నం. రెండోది సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు. వీటి సాయంతో విపక్షాలను అణగదొక్కే కుట్రలు. మూడోది అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న రాజకీయ, అధికారస్వామ్యం. మోదీ చక్రవ్యూహానికి గుండెకాయ వంటి ఈ శక్తులు దేశాన్ని నాశనం చేస్తున్నాయి’’ అంటూ దుయ్యబట్టారు.

మధ్యతరగతికి వెన్నుపోటు 
కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతిని దారుణంగా వెన్నుపోటు పొడిచారని రాహుల్‌ ఆరోపించారు. ‘‘మోదీకి కాస్తో కూస్తో మద్దతుగా నిలిచిన వర్గం మధ్యతరగతి. కొవిడ్‌ సమయంలో ఆయన మొబైల్‌ టార్చిలు వేయమంటే వేసింది. పళ్లాలు మోగించండంటే మోగించింది. అలాంటి వర్గంపై బడ్జెట్లో పెను భారం వేశారు. తద్వారా వారి వెన్నులోనూ, ఛాతీలోనూ కత్తులు దింపారు మోదీ’’ అన్నారు. 

‘‘ఇదీ మా మంచికే. మధ్యతరగతి ఇక ఇండియా కూటమి వైపు మొగ్గుతుంది’’ అని జోస్యం చెప్పారు. ‘‘మోదీ చక్రవ్యూహపు  దు్రష్పభావాన్ని కేంద్ర బడ్జెట్‌ బలహీనపరుస్తుందని, యువత, రైతులు, కారి్మకులు, చిరు వ్యాపారులను ఆదుకుంటుందని ఆశించా. కానీ వ్యాపార, రాజకీయ గుత్తాధిపత్యాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందింది. దేశంలోని టాప్‌ 500 కంపెనీల్లో యువతకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కలి్పస్తారట! బడ్జెట్లో విత్త మంత్రి పేర్కొన్న ఈ పథకం హాస్యాస్పదంగా ఉంది. 

ఎందుకంటే 99 శాతం మంది యువతకు అది అందని ద్రాక్షే. నిరుద్యోగ చక్రవ్యూహం, పేపర్‌ లీకేజీ చక్రవ్యూహం, అగ్నివీర్‌ చక్రవ్యూహం... ఇలా విద్యార్థులు, యువత, సైన్యంతో పాటు ఏ రంగాన్నీ వదలకుండా సమస్యల సుడిగుండంలో ముంచెత్తారు’’ అంటూ మండిపడ్డారు. ‘‘మీరు సృష్టించిన అన్ని చక్రవ్యూహాలనూ మేం ఛేదించేస్తాం. దేశవ్యాప్త కులగణనే అందుకు సరైన అస్త్రం’’ అన్నారు. ‘‘దేశ యువత, వెనకబడ్డ వర్గాలు అభిమన్యులని ఈ చక్రవ్యూహ సృష్టికర్తలు అపోహ పడుతున్నారు. కానీ నిజానికి వాళ్లంతా ఆ వ్యూహాన్ని ఛేదించే అర్జునులు’’ అని హెచ్చరించారు. అగి్నవీర్‌ వంటి సున్నితమైన పథకంపై విమర్శలు సరికావంటూ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభ్యంతరం వెలిబుచ్చారు.

మాది శివుని ఊరేగింపు 
ఇండియా కూటమిని శివుని పెళ్లి ఊరేగింపుతో రాహుల్‌ పోల్చారు. ‘‘అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మోదీ చక్రవ్యూహం కేవలం ఆరుగురికే పరిమితం. ఆ చక్రవ్యూహానికి, శివుని ఊరేగింపుకు పోరాటమిది’’ అన్నారు.

‘హల్వా’ ఫొటోపై విసుర్లు 
ప్రసంగం సందర్భంగా లోక్‌సభలో రాహుల్‌ ప్రదర్శించిన బడ్జెట్‌ హల్వా ఫొటో కలకలానికి దారి తీసింది. బడ్జెట్‌ ముద్రణకు ముందు దాని తయారీ ప్రక్రియలో పాల్గొన్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా తయారు చేయడం రివాజు. అలా ఈసారి నిర్మలా సీతారామన్‌ బృందం బడ్జెట్‌ హల్వా తయారు చేస్తున్న ఫొటోను చూపిస్తూ, ‘‘ఇందులో కని్పస్తున్న 20 మంది అధికారుల్లో దళితులు, ఆదివాసీలు ఒక్కరు కూడా లేరు. మైనారిటీ, ఓబీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు’’ అంటూ రాహుల్‌ ఆక్షేపించారు. రాహుల్‌ ఆ ఫొటోను ప్రదర్శిస్తున్న సమయంలో నిర్మల రెండు చేతుల్లో ముఖం దాచుకుంటూ కని్పంచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement