
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా అయిదో రోజు కూడా పెరిగాయి. ఆదివారం లీటరుపై పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగినట్లు ప్రభుత్వం రంగ ఇంధన సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో, లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.107.59కు, ముంబైలో రూ. 113.46కు చేరిందని తెలిపాయి. అదేవిధంగా లీటరు డీజిల్ ధర ముంబైలో రూ.104.38కి, ఢిల్లీలో రూ.96.32కు చేరింది. కాగా, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు.
ఈ పెరుగుదలను ప్రభుత్వం పాల్పడుతున్న పన్ను దోపిడీగా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కొంతయినా ఉపశమనం లభిస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేయడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. దేశంలో తీవ్రస్థాయికి చేరిన నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు, పెట్రోల్ ధరల పెంపులో మోదీ ప్రభుత్వం రికార్డులు సాధించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment