1947, ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించింది. ఆరోజు నుంచి ప్రతీయేటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం పలువురు సమరయోధులు పోరాటాలు సాగించారు. వీరి త్యాగానికి గుర్తుగా దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారకాలు ఉన్నాయి. ఇదేవిధంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వారి స్మారకాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆగస్టు 15న ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిస్తారు.
1. కార్గిల్ వార్ మెమోరియల్ (లధాఖ్)
పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరులైనవారి గౌరవార్థం 1990ల చివరలో భారత సైన్యం కార్గిల్ వార్ మెమోరియల్‌ని నిర్మించింది. ఈ స్మారక చిహ్నంపై యుద్ధంలో వీరమరణం పొందిన భారతీయ సైనికులందరి పేర్లను చెక్కారు.
2. ఎర్రకోట (ఢిల్లీ)
ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని ఎర్రకోటపై జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట నుంచి ప్రసంగించారు.ఈ ఎర్రకోటను షాజహాన్ నిర్మించారు. ఎరుపు రంగు ఇసుకరాయితో నిర్మించినందున దీనికి ఎర్రకోట అని పేరు పెట్టారు.
3. జలియన్ వాలా బాగ్ (అమృత్‌సర్)
1919లో జలియన్‌వాలాబాగ్‌లో స్వాతంత్ర్య సమరయోధులు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎటువంటి హెచ్చరిక లేకుండా జనరల్ డయ్యర్ కాల్పులు జరపాలని ఆదేశించాడు. నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండలో వందల మంది అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థం జలియన్‌వాలాబాగ్‌లో స్మారక చిహ్నం నిర్మించారు.
4. ఇండియా గేట్(ఢిల్లీ)
దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో ఉన్న ఇండియా గేట్ మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన 82 వేల మంది భారతీయ ఆర్మీ సైనికుల గౌరవార్థం నిర్మితమయ్యింది. ఈ అమరవీరుల పేర్లు ఇండియా గేట్ గోడలపై కనిపిస్తాయి.
5. పోరుబందర్(గుజరాత్)
గుజరాత్‌లోని పోర్‌బందర్ జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. కీర్తి మందిర్, మహాత్మా గాంధీ నివసించిన ఇల్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని గాంధీ జీవితంతో పాటు ఆయన రచనలను వివరించే మ్యూజియంలుగా మార్చారు.
6. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ (ప్రయాగ్‌రాజ్)
1931లో చంద్రశేఖర్ ఆజాద్ ఈ ప్రయాగ్‌రాజ్ పార్కులో బ్రిటిష్ సైనికులతో పోరాడారు. అతను తన 25 ఏళ్ల వయస్సులోనే జీవితాన్ని త్యాగం చేశారు. చంద్రశేఖర్ ఆజాద్‌ను బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టినప్పుడు, వారి తూటాలకు బలికావడం ఇష్టం లేక ఈ పార్కులో తనను తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఈ పార్కులో చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment