
వారణాసి:సొంత నియోజకవర్గం వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దివ్యాంగులైన వ్యాపారవేత్తలతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ల వల్ల వారు చేస్తున్న వ్యాపారాలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో అడిగి తెలుసుకున్నారు.
దివ్యాంగ వ్యాపారవేత్తలతో సంభాషణలో భాగంగా అందులో ఒకరిని మోదీ పలకరించారు. ఏం వ్యాపారం చేస్తున్నావని మోదీ ప్రశ్నించారు. తాను స్టేషనరీ వ్యాపారం చేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ తనకు, తన ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని ఆ దివ్యాంగుడు బదులిచ్చాడు. ఆదాయం ఎంత వస్తోందని మోదీ అడగ్గా చెప్పేందుకు అతడు కాసేపు ఆలోచించాడు. దీంతో ఇన్‌కమ్‌ట్యాక్స్(ఐటీ) వాళ్లను పంపుతాననుకుంటున్నావా అతనితో అని మోదీ చమత్కరించారు.
ప్రధాని తన పర్యటనలో భాగంగా ఆయుష్మాన్‌భారత్ యోజన, ఉజ్వల్ యోజన, పీఎం స్వనిధి యోజన, ముద్రయోజన తదితర పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. కాశీ తమిళ్ సంగమం 2.0ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.