
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతో కనీస మద్దతు ధరకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్యాలు ప్రచారం చేస్తూ అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున రైతు ఆందోళనలు కొనసాగుతున్న వేళ, మధ్యప్రదేశ్ రైతులతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొత్త వ్యవసాయ చట్టాలపై ఎవరికైనా అనుమానాలు, ఆందోళనలు ఉంటే వారితో చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వారి భయాలు పోగొడతాం. అన్నదాతల ముందు తలలు వంచి, చేతులు జోడిస్తున్నాం. కనీస మద్దతు ధర ఎత్తివేస్తారనేది అతి పెద్ద అబద్ధం’’ అని పేర్కొన్నారు. (చదవండి: వ్యవసాయ బిల్లుల కాపీలను చించివేసిన కేజ్రివాల్)
ఇక ఈ సంస్కరణలు రాత్రి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదన్న ప్రధానమంత్రి.. ‘‘గత 22 ఏళ్లుగా ప్రతీ ప్రభుత్వం, రాష్ట్రాలతో ఈ విషయం గురించి అనేకమార్లు చర్చలు జరిపింది. రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయవాదులు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. కానీ ఈరోజు కొన్ని పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. తమ మేనిఫెస్టోలో వీటి గురించి హామీలు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు బాధ పడుతున్నారు.
ఇంత మంచి సంస్కరణలు మేం ఎందుకు ప్రవేశపెట్టలేకపోయామని, ఆ ఘనత మోదీకే ఎందుకు దక్కాలని తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. అలాంటి వాళ్లకు నా సమాధానం ఒక్కటే... నాకు ఎలాంటి క్రెడిట్ వద్దు. మొత్తం మీరే తీసుకోండి. మీ ఎన్నికల ప్రణాళికను మేం అమలు చేశాం. రైతుల అభివృద్ధే మాకు ముఖ్యం. దయచేసి రైతులను తప్పుదోవ పట్టించకండి’’అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇక మధ్యప్రదేశ్‌లోని రైతు రుణమాఫీ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ ఈ సందర్భంగా ప్రధాని మోదీ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment