మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  | PM Modi-Led Cabinet Approves 33% Women Reservation Bill | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

Published Tue, Sep 19 2023 7:20 AM | Last Updated on Tue, Sep 19 2023 8:51 AM

PM Modi Led Cabinet Approves 33 Women Reservation Bill - Sakshi

( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు తొలిరోజు ముగిశాక కేంద్ర కేబినెట్ సమావేశమై పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేబినెట్ చారిత్రాత్మక ప్రకటన చేసింది. 

చట్టసభల్లో రిజర్వేషన్..  
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడో వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించబడతాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ రిజర్వ్‌డ్ సీట్లలో మార్పులు చేయాలని కేబినెట్ ప్రతిపాదించింది. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు సబ్-రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం, లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉండగా, అందులో 78 మంది మహిళా సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా, అందులో 24 మంది మహిళా సభ్యులు.

ఈసారి అంతా సానుకూలమే.. 
మహిళా రిజర్వేషన్ బిల్లు మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకో లేదు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో పలుమార్లు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయి మెజార్టీ మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయేది. అన్ని పార్టీలు ఈ బిల్లుపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అంతా సజావుగా సాగితే ఈ సమావేశాల్లోనే బిల్లుకు మోక్షం కలిగే అవకాశం ఉంది. 


స్వాతంత్ర్యం వచ్చినప్పటనుంచి ఇప్పటివరకూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడ్డ మహిళలు
ఎన్నికల్లో గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టిన మహిళలు

ఇప్పటిది కాదు.. 
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం మొట్టమొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వం, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలో కూడా బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభలో ఆమోదం పొందలేదు. 2010లో ఎట్టకేలకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ లోక్‌సభలో మాత్రం ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలోని కేబినెట్‌ బిల్లుపై నిర్ణయం తీసుకుంది.  మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఇంకే నిర్ణయాలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

ప్రధానికి మాత్రమే సాధ్యం.. 
కేబినెట్ సమావేశం  ముగిశాక మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ స్పందిస్తూ మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను  నెరవేర్చే ధైర్యం ఒక్క మోదీ ప్రభుత్వానికే ఉందన్నారు. కేబినెట్ ఆమోదంతో ఇది మరోసారి రుజువైందన్నారు. ఈ సందర్భంగా ఈ బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఆదిత్య ఎల్​1.. అసలు కథ షురూ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement