( ఫైల్ ఫోటో )
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు మంచి అనుబంధమే ఉందని, కానీ అది రాజకీయంగా కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. జూన్ 8న ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ త్వరలోనే రాజకీయంగా కూడా ఒకటవుతారనే వార్తలు వినిపించాయి. ఈ సమావేశంపై కొందరు విమర్శలు కూడా చేశారు. మహారాష్ట్ర పాలక శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) -కాంగ్రెస్ కూటమి ఇబ్బందుల్లో ఉందని, శివసేన బీజేపీతో జట్టు కట్టనుందని పుకార్లు వచ్చాయి.
తాజాగా ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘జూన్ 8న మోదీని ఉద్ధవ్ కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు వారి మధ్య చర్చ కొనసాగింది. వెంటనే అనేక ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. శివసేనతో బీజేపీ మరోసారి చెతులు కలుపుతుందనే వార్తలు గుప్పుమన్నాయి. మా మార్గాలు వేరు కావచ్చు కానీ మా మధ్య గట్టి అనుబంధమే ఉంది. ఠాక్రే కుటుంబానికి, నరేంద్ర మోదీకి మధ్య చాలా సంవత్సరాలు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలు వేరుగా ఉంటాయి’ అని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు.
ఇక శరద్ పవార్ గురించి స్పందిస్తూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తాము ఎల్లప్పుడూ పవార్ కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాము. అందరితో మమేకమై జీవించడం మహారాష్ట్ర సంస్కృతి అని సంజయ్ రౌత్ అన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు కొట్టివేసిన మరాఠా రిజర్వేషన్ల కోటా విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరినట్టు ఆయన తెలిపారు.
చదవండి: జాబ్ నిలవాలంటే టెన్త్ పాసవ్వాలన్నారు, ఎట్టకేలకు 57 ఏళ్ల వయసులో
Comments
Please login to add a commentAdd a comment