బలగాల ఆవిష్కరణల ప్రదర్శనలో ప్రధాని మోదీ
కెవాడియా(గుజరాత్): భారత సైనిక దళాల దృఢనిశ్చయం, అంకితభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసించారు. గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారితోపాటు సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లను మన సైన్యం ధైర్యంగా ఎదుర్కొంటోందని కొనియాడారు. గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైన్డ్ కమాండర్ల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. కొత్తకొత్త సవాళ్లకు ధీటుగా బదులివ్వడానికి భారత సైన్యం ‘భవిష్యత్ శక్తి’గా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. మూడు రోజులుగా జరుగుతున్న ఆ సదస్సులో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లను కూడా భాగస్వాములుగా చేయడం మంచి పరిణామని అన్నారు. మన దేశం వచ్చే ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సైన్యాన్ని ప్రధాని మోదీ కోరారు.
కోల్‌కతాకు నేడు మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సమర శంఖం పూరించేందుకు ప్రధాని మోదీ నేడు కోల్‌కతాలో పర్యటించనున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు సుమారు 10 లక్షల మందిని సమీకరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, అభ్యర్థుల ప్రకటన జరుగుతుండడంతో ప్రచారంలో మరింత జోరు పెంచేందుకు ప్రధాని రంగంలో దిగారు. మొదటి దశ పోలింగ్ 27న జరగనుంది. బెంగాల్ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని 20 ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మరోవైపు సినీ నటుడు మిథున్ చక్రవర్తి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రధాని సమావేశానికి హాజరు కానున్నారు. ఈ వేదికపై ప్రధాని సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. ఆయనను బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment