సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ గడిచిన వందేళ్లలో వచ్చిన అతిపెద్ద మహమ్మారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ఇలాంటిది చూడలేదని, అనుభవించలేదని చెప్పారు. ఈ శతాబ్ధంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం సెకండ్ వేవ్ తర్వాత మొదటి సారి ఆయన జాతినుద్ధేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా.. ‘‘ కరోనా వచ్చిన తర్వాత దేశంలో వైద్య రంగాన్ని బలోపేతం చేశాం. రెండో వేవ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి డిమాండ్ రాలేదు. విమానాలు, రైళ్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేశాం. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాలి. మాస్క్, భౌతిక దూరం పాటించాలి. వ్యాక్సిన్ రక్షణ కవచం లాంటిది. వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా తక్కువగా ఉన్నాయి. విదేశాల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవటం కఠినతరంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. దేశంలో వందశాతం వ్యాక్సినేషన్‌కు ప్రణాళికలు రూపొందించాం. ఇందుకోసం మిషన్ ఇంద్రధనస్సును రూపొందించాం. ఇప్పుడు వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేసే సమయంలోనే రెండో వేవ్ వచ్చింది. రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లను ప్రారంభించాం. కరోనాను ఎదురిస్తామనే విశ్వాసం అందరికీ ఉండాలి.
తక్కువ సమయంలోనే మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. 23 కోట్ల మందికి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ వేశాం. వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశాం. వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మౌలిక సదుపాయాలతోపాటు భారీగా నిధులు కూడా కేటాయిస్తాం. మరో 3 వ్యాక్సిన్ల ట్రయల్స్ తుదిదశలో ఉన్నాయి. వివిధ దేశాల్లో ఉన్న వ్యాక్సిన్ల కొనుగోలు. కొంతమంది పిల్లలపై ఆందోళన వ్యక్తం చేశారు. నేజిల్ వ్యాక్సిన్‌పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది సఫలమైతే పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్‌పైనా పరిశోధనలు జరుగుతాయి. ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనలు పాటిస్తున్నాం. సీఎంల సమావేశంలో వచ్చిన సలహాలు, సూచనలు పాటించాం.
కరోనా వల్ల ఇబ్బంది పడేవారికే ప్రధానంగా వ్యాక్సిన్లు వేశాం. కరోనా రెండోదశ వచ్చేలోపు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ ప్రారంభించకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేం. వైద్యులకు వ్యాక్సిన్ వేయడం వల్లే పరిస్థితి మెరుగ్గా ఉంది. వైద్యులు లక్షలాదిమంది ప్రాణాలను కాపాడారు . ఈ మధ్య అనేక సూచనలు, డిమాండ్లు మా ముందుకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు కొనుగోళ్లు చేసే అవకాశం ఇవ్వట్లేదని ప్రశ్నించారు. లాక్‌డౌన్ విషయంలో రాష్ట్రాల డిమాండ్‌ను అంగీకరించాం. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వికేంద్రీకరించాలని రాష్ట్రాలు కోరాయి. మా పరిధిలో ఉన్న అంశాలు కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోందని ప్రశ్నించాయి. దేశంలోని మీడియాలో ఓ వర్గం ఇలాంటి డిమాండ్లపై ప్రచారం చేశాయి. మే 1 నుంచి వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్రాలకే ప్రాధాన్యత. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనే డిమాండ్ ఉంది ’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment