సాక్షి, ఢిల్లీ: ఒలంపిక్స్ క్రీడాకారులకు మద్దతుగా ఇప్పటికే ప్రారంభమైన ‘విక్టరీ పంచ్ క్యాంపెయిన్’ ను మరింత ముందుకు తీసుకెళ్లాలంటూ ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా పిలుపునిచ్చారరు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఆదివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ..'' ఆటగాళ్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. అందరూ తమ తమ టీమ్‌తో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. ఆటగాళ్లందరూ చాలా కష్టపడి టోక్యోకు చేరుకున్నారని, ప్రజలు తెలిసో, తెలియకో వారిపై ఎలాంటి ఒత్తిళ్లూ చేయకూడదు.'' అని తెలిపారు. ఇక సోమవారం ‘కార్గిల్ విజయ దివస్’ ను జరుపుకుంటున్నామని, 1999 లో మన దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన జవాన్లకు నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్గిల్ యుద్ధం దేశ సాయుధ దళాల శౌర్యానికి, క్రమశిక్షణకు చిహ్నమని పేర్కొన్నారు.
రాబోయే ఆగస్టు 15 చాలా స్పెషల్ అని మోదీ పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగిడబోతున్నామని, అందుకే ఇది చాలా ప్రత్యేకమని, అలాగే ‘అమృత్ మహోత్సవ్’ కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. అమృత్ మహోత్సవ కార్యక్రమం ప్రభుత్వానిది కాదని, 130 కోట్ల మంది భారతీయు మనోభావాలకు సంబంధించినదని అన్నారు. ఇక దేశ ప్రజలందరూ భయాన్ని వీడి, వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని మోదీ మన్ కీ బాత్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘‘దయచేసి భయాన్ని వీడండి. వ్యాక్సిన్ తీసుకోండి. కొందరికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చింది. కానీ ఇది చాలా చిన్నది. కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. వ్యాక్సిన్‌ను నిరాకరించడం చాలా అపాయం. వ్యక్తిగతంగానూ క్షేమం కాదు. దయచేసి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి’’ అని మోదీ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment