నాకు భావోద్వేగ సందర్భమిది: మోదీ
కార్యక్రమంతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడ్డాయన్న ప్రధాని
న్యూఢిల్లీ: ‘‘మసాలా వార్తలు, ప్రతికూల అంశాలపైనే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారన్న వాదనలో నిజం లేదని మన్‌కీ బాత్ నిరూపించింది. సానుకూల కథనాలు, స్ఫూర్తిదాయక అంశాలకు అమితమైన ఆదరణ ఉంటుందని ఈ కార్యక్రమంతో తేటతెల్లమైంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం పదేళ్లు పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా ఆదివారం 114వ మన్‌కీ బాత్‌లో మోదీ మాట్లాడారు. దేశ ప్రజల సామూహిక శక్తిని ప్రదర్శించే వేదికగా ఈ కార్యక్రమం మారిందంటూ ప్రశంసించారు. దీనికి పదేళ్లు పూర్తయిన సందర్భం తనను భావోద్వేగానికి గురి చేస్తోందన్నారు. ‘‘సరిగ్గా పదేళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రారంభమైంది. భారత స్ఫూర్తిని వేడుక చేసుకొనే విశిష్టమైన వేదికగా మారింది. దీనితో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.
ఈ ప్రయాణంలో శ్రోతలు నాతోపాటు కలిసి నడిచారు. దేశ నలుమూలల నుంచి నాకు సమాచారం చేరవేశారు. మన్‌కీ బాత్ అంటే నా వరకు దైవదర్శనానికి ఆలయానికి వెళ్లడం లాంటిదే. దీనితో అనుసంధానమైన ప్రతి అంశం ద్వారా సామాన్య ప్రజలను దర్శించుకున్నట్లే భావిస్తా. ప్రజలే నాకు దేవుళ్లు. 22 భారతీయ, 12 విదేశీ భాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ మలుపులో మరోసారి ప్రజల ఆశీస్సులు కోరుతున్నా’’ అన్నారు.
పుణే మెట్రో తొలి దశ ప్రారంభం
పుణే: ‘‘గత ప్రభుత్వాలు పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో ఒక ప్రణాళిక, దార్శనికత లోపించాయి. మేమొచ్చాక వచ్చాక పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. పాత పని సంస్కృతికి చరమగీతం పాడాం’’ అని మోదీ చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలో పుణే మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ‘క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే స్మారక బాలిక పాఠశాల’ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. గత ప్రభుత్వాల విధానాలు అమల్లో ఉంటే పుణే మెట్రో ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయి ఉండేది కాదన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే చొరవతో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగుతున్నాయని చెప్పారు.
వాటికీ పదేళ్లు
ప్రతిష్టాత్మకంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కూడా పదేళ్లు పూర్తి చేసుకుందని మోదీ గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కూ అక్టోబర్ 2న పదేళ్లు పూర్తవుతాయన్నారు. ‘‘ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ విజయవంతమవుతోంది. జీవితాంతం పరిశుభ్రత కోసం తపించిన మహాత్మా గాం«దీకి ఇదో గొప్ప నివాళి. ఇక పారిశ్రామికవేత్తలతో పాటు చిరు వ్యాపారుల కృషితో ‘మేకిన్ ఇండియా’ విజయవంతమైంది. మన యువశక్తి కృషితో తయారీ రంగానికి భారత్ కేంద్రస్థానంగా మారింది. అటోమొబైల్స్ మొదలుకుని రక్షణ దాకా అన్ని రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి.
స్థానికతకు జై
స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని పెంచి ప్రోత్సహిస్తే అంతిమంగా దేశానికే లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారు. ‘‘మన గడ్డపై మన కళాకారులు, కారి్మకుల రెక్కల కష్టంతో తయారైన ఉత్పత్తులే మనకు గర్వకారణం. పండుగల వేళ స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయండి’’ అని పిలుపునిచ్చారు. జల సంరక్షణలో నూతన విధానాలు చక్కటి ఫలితాలిస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘కొన్నిచోట్ల మహిళా శక్తి జలశక్తిని పెంచుతోంది. మరికొన్నిచోట్ల జలశక్తి మహిళా శక్తికి తోడ్పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పురా గ్రామంలో భారీ నీటి కుంట నిర్మించి భూగర్భ జలాలను పెంచారు. డ్వాక్రా మహిళలు అందులో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment