నేడు అమర వీరుడు బిర్సా ముండా జయంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (బుధవారం) జార్ఖండ్‌లోని బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతుకు వెళ్తున్నారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో గల ఉలిహతును దేశ ప్రధాని సందర్శించడం ఇదే మొదటిసారి. ఉలిహతులో బిర్సా ముండాకు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా రూ. 24 వేల కోట్ల విలువైన ట్రైబల్ మిషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ నేడు ముందుగా రాంచీలోని లార్డ్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్, ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని సందర్శించనున్నారు. అనంతరం బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతు గ్రామానికి చేరుకుని, అక్కడ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.
బిర్సా ముండా గిరిజనుల పాలిట హీరోగా నిలిచారు. గిరిజనులు అతనిని దేవుడిలా భావిస్తారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారు. గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించారు. అలాగే గిరిజన సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రచారాన్ని చేపట్టారు. భూస్వాముల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు.
1894లో బిర్సా ముండా ఆదాయ మాఫీ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ముండా తిరుగుబాటు లేదా ఉల్గులన్ అని పిలుస్తారు.
1895లో బ్రిటీష్ వారు బిర్సా ముండాను అరెస్టు చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత బిర్సా ముండా బ్రిటిష్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని ఏకీకృతం చేశారు. 1899, డిసెంబరు 24న బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ నేపధ్యంలో బ్రిటీష్ వారు 1900, మార్చి 3న అతనిని అరెస్టు చేశారు. బిర్సాముండా 1900, జూన్ 9న రాంచీ జైలులో మరణించారు. ఆ సమయానికి బిర్సా ముండా వయసు కేవలం 25 సంవత్సరాలు.
ఇది కూడా చదవండి: ఏడు దాటినా వీడని పొగమంచు.. దిక్కుతోచని ఢిల్లీ జనం!
Comments
Please login to add a commentAdd a comment