Vaccination In India: Covid Vaccination Drive In India Launched By PM Modi - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ

Published Sat, Jan 16 2021 10:48 AM | Last Updated on Sat, Jan 16 2021 12:56 PM

PM Narendra modi Launches Corona Vaccination - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10:30 నిమిషాలకు వర్చువల్‌ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొని వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్‌ కోసం శ్రమించిన శాస్త్రవేత్తలు, సంస్థలకు అభినందనలు తెలిపారు. నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తొలి హక్కు దారులని అన్నారు. వీరందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌కు చెందిన శాస్త్రవేత్తలు, సంస్థలు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులను ఖచ్చితంగా తీసుకోవాలని ప్రధాని సూచించారు. టీకా వేసుకున్నా.. మాస్క్‌, సామాజిక దూరం పాటించాల్సిదేనని స్పష్టం చేశారు.

రెండో దశలో 30 కోట్ల మందికి టీకాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘ఎవరికీ ఎప్పుడు టీకా అందిస్తామో వారికి ముందుగా సమాచారం ఇస్తాం. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఖచ్చితంగా వేసుకోవాలి. తొలి డోసు, రెండో డోసుకు మధ్య నెల రోజుల సమయం పడుతుంది. రెండో డోసు వేసుకున్న తర్వాతనే.. కరోనాకు వ్యతిరేకంగా మీ శరీరంలో వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుంది. టీకా వేసుకున్న తర్వాత కూడా మాస్క్, సామాజిక దూరం పాటించాల్సిందే. ప్రపంచంలో 100కుపైగా దేశాల్లో జనాభా 3 కోట్లకంటే తక్కువే. కానీ భారత్‌లో మొదటి దశలోనే 3 కోట్ల మందికి టీకా ఇస్తున్నాం. రెండో దశలో 30 కోట్ల మందికి టీకాలు ఇస్తాం. అన్నీ రక్షణ చర్యలు చూసుకునే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చాం. వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. భారత్ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నమ్మకం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 60శాతం మంది పిల్లలకు ఇస్తున్న పలు వ్యాక్సిన్లు భారత్‌వే. ఇతర దేశాల వ్యాక్సిన్ కంటే మన వ్యాక్సిన్లు చాలా చౌక, సులువైనది. ఈ వ్యాక్సిన్లు కరోనాపై పోరాటంలో భారత్‌కు విజయాన్ని అందిస్తాయి. సమస్య ఎంత పెద్దదైనా మనం ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఒకప్పుడు మాస్క్‌లు, పీపీఈ కిట్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు అన్నీ మన దేశంలోనే తయారవుతున్నాయి. సొంత లాభం కొంత మానుకో.. పొరుగు వారికి తోడ్పడవోయ్.. దేశం అంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్.. తెలుగులో మహాకవి గురజాడ అప్పారావు చెప్పారు. గురజాడ చెప్పినట్లు పరుల కోసం మనందరం పాటుపడాలి.

ప్రజల కోసం తమ ప్రాణాలను ఆహూతిచ్చారు
చనిపోయిన వారికి పద్దతిగా అంత్యక్రియలు చేయని పరిస్థితి గతంలో ఉండేది. కరోనా సమయంలో హెల్త్ వర్కర్లు, పోలీసులు.. పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబాలను వదిలి ప్రజలకోసం పనిచేశారు. కొందరైతే పనిచేస్తునే చనిపోయారు. ప్రజల ప్రాణాలకోసం తమ ప్రాణాలను ఆహూతిచ్చారు. కరోనాపై పోరాడుతూ చనిపోయినవారందరికీ శ్రద్ధాంజలి. కరోనా తీవ్రతపై శాస్త్రవేత్తలు, సమాజానికి ఎలాంటి ఊహ లేకుండాపోయింది. కరోనా వల్ల భారత్‌ తీవ్రంగా నష్టపోతుందని ప్రపంచం భావించింది. ఇంత జనాభా ఉన్న భారత్‌ కరోనాను ఎలా తట్టుకుంటుందని అనుకున్నారు. జనవరి 30, 2020న తొలి కరోనా కేసు నమోదు అయింది. కానీ అంతకంటే రెండు వారాల ముందే హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశాం. 2020, జనవరి 17న కరోనాపై తొలి అడ్వైజర్ జారీ చేశాం. కరోనాపై పోరాటంలో భారత్ చూపించిన సాహసం రాబోయే తరాలకు ఆదర్శం. జనతా కర్ఫ్యూ ప్రజలను మానసికంగా లాక్‌డౌన్‌కు సిద్ధం చేసింది. కరోనాను ఆపడానికి ఎక్కడిప్రజలు అక్కడే ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. లాక్‌డౌన్‌లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కరోనాతో చైనాలో చిక్కుకున్న పౌరులను కొన్ని దేశాలు అక్కడే వదిలేశాయి. కానీ భారత్‌ చైనా నుంచి తమ పౌరులను వెనక్కి తెచ్చుకుంది. వందే భారత్ ద్వారా 35 లక్షల మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చాం’ అని అన్నారు.

కాగా శనివారం నుంచి దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు హెల్త్‌ వర్కర్స్‌కు మాత్రమే కరోనా టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత దశలవారీగా సామాన్య ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్‌  అందుబాటులోకి రానుంది. తొలి విడతలో 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయనున్నారు. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోస్ ఇవ్వనున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ నెంబర్ - 1075ను సైతం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

గర్భవతులకు వ్యాక్సిన్‌ ఇవ్వవద్దు
గర్భవతులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌ ఇవ్వవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎవరికి వ్యాక్సిన్‌ ఇవ్వకూడదో చెబుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. కేవలం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని పేర్కొంది. గర్భవతులు, పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరగనందున వారికి వ్యాక్సిన్‌ ఇవ్వవద్దని స్పష్టం చేసింది. మొదటగా ఇచ్చిన డోసుకు సంబంధించిన వ్యాక్సిన్‌నే 14 రోజుల వ్యవధితో ఇచ్చే రెండో డోసులోనూ ఇవ్వాలని స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement