ట్రెయినీ ఐఏఎస్‌ పూజ వ్యవహారంపై పీఎంవో ఆరా | PMO Seeks Report On IAS Trainee Officer Puja Khedkar From Pune Collector, See Details Inside | Sakshi
Sakshi News home page

ట్రెయినీ ఐఏఎస్‌ పూజ వ్యవహారంపై పీఎంవో ఆరా

Published Thu, Jul 11 2024 2:16 PM | Last Updated on Thu, Jul 11 2024 4:03 PM

Pmo Seeks Report On Puja Khedkar From Pune Collector

పుణెలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ పూజా ఖేడ్కర్‌ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్యం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)సర్టిఫికేట్‌లను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగా.. పూజా ఖేడ్కర్ నియామకం గురించి ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఆరా తీస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

పూజా ఖేడ్కర్‌ పూణే కలెక్టర్‌ కార్యాయంలో అధికారిక హోదా కోసం ప్రయత్నించి వార్తల్లో నిలిచారు. ఉన్నతాధికారుల అనుమతిలేకుండా ప్రైవేట్ ఆడి కారును రెడ్ బ్లూ బెకన్ లైట్, వీఐపీ నెంబర్‌ ప్లేట్‌ను ఉపయోగించడం, అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోర్‌ లేని సమయంలో.. ఆయన ఛాంబర్‌ను వినియోగించడంతో వివాదం తలెత్తింది. ఆమె తీరుపై పూణె కలెక్టర్‌ డాక్టర్‌ సుహాస్‌ దివాసే చీఫ్‌ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం ఆమెను పుణె నుంచి వాశిమ్‌ జిల్లాకు బదిలీ చేసింది. ప్రొబేషన్‌ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్‌ న్యూమరరీ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు

ఈ క్రమంలో బుధవారం పీఎంవో కార్యాలయం అధికారులు పూజా ఖేడ్కర్ గురించి పూణే కలెక్టర్ సుహాస్‌ నుంచి నివేదికను కోరడం మరింత చర్చాంశనీయంగా మారింది. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LSBNAA) లో ఆమె గురించి ఆరా తీసింది. ఆమె పూణె నుంచి వాశిమ్‌ జిల్లాకు బదిలీ చేయడంపై నివేదిక కోరింది. పూర్తి నివేదికను ఎల్‌ఎస్‌బీఎన్‌ఏఏ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపనుంది.

మహరాష్ట్ర చీఫ్ సెక్రటరీ (సీఎస్‌) సుజాత సౌనిక్‌ ఆమోదం తర్వాత నివేదిక పంపాలని ఎల్‌ఎస్‌బీఎన్‌ఏఏ డిప్యూటీ డైరెక్టర్ శైలేష్ నావల్ సంబంధిత పరిపాలన విభాగానికి విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement