వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే చెబుతున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా యూత్.. బైకులు, కార్లపై విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా కొందరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఓవరాక్షన్ చేయగా ట్రాఫిక్ పోలీసులు వారిని ఏకంగా 77వేల జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. యూపీలో హాపూర్‌లో నడిరోడ్డుపై కొందరు యువకులు హల్‌చల్ చేశారు. బెంజ్ కార్లు, బైక్‌లపై వెళ్తూ వీడియోలు తీసుకున్నారు. ఇన్స్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం నానా హంగామా క్రియేట్ చేశారు. హైస్పీడ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతూ పక్కన వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక, ఈ వీడియోలు హాపూర్ ఎస్సీ అభిషేక్ వర్మ దృష్టికి చేరాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారి వాహనాలు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను గుర్తించి యువకులకు రూ.77,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ ప్రకారం.. వారికి జరిమానా విధించినట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచించారు. లేకపోతే భారీ జరిమానాలు సహా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment